Facebook Twitter
మీరు వీరులే

రాజ్యాన్ని ఏలే రాజులే              

 

ఓ పీడిత తాడిత ప్రజల్లారా!

ఓ బడుగు బలహీన వర్గాల్లారా!

మీరికనైనా మొద్దునిద్ర నుండి మేల్కోండి

నిండు నిజాలను తెలుసుకోండి

నిప్పురవ్వలై రగలండి

మీ ఆలోచనల్లో వినూత్నమైన

విప్లవాత్మకమైన మార్పులు రావాలి

మీలో అఖండమైనశక్తి నిక్షిప్తమై ఉందన్న

ఒక నగ్నసత్యాన్ని మీరు తెలుసుకోవాలి    

 

మీరు వేరువేరుగా ఉంటే 

వేరులేని వృక్షంలా కుప్పకూలిపోతారు 

ఎన్ని ఏళ్ళైనా మీరు చిగురులుతొడగలేరు

మీరు ఒకరికొకరు కొండలా అండగా ఉంటే 

మీరు మండేసూర్యులౌతారు 

మనువాదుల్ని మసిచేస్తారు

 

మీరు ఒకరినొకరు ద్వేషించుకోవడం 

దూషించుకోవడం మానుకోవాలి

ఒకరినొకరు మాటల తూటాలతో

మనసును గాయపరుచుకోరాదు

పగా ప్రతీకారాలతో రగిలి పోరాదు

మీరు‌ ఒకరినొకరు ప్రేమించుకోవాలి

గౌరవించుకోవాలి సహాయం చేసుకోవాలి

 

ఒకరినొకరు క్షమించుకోవాలి

సంతోషంగా సహకరించుకోవాలి

ఎవరు తప్పుచేసినా ఒప్పుకోవాలి 

మిమ్ము విభజించాలని తెరవెనుక  

అగ్రజాతి ఆడే ఆటలను నాటకాలనుచేసే

కుట్రలను కుతంత్రాలను తెలుసుకోవాలి

మీరందరూ ఏకమైతే మీరు  

రాజ్యాలను ఏలే రాజులౌతారు

 

అదే అమరజీవి అంబేడ్కర్ జీవితలక్ష్యం

అది సాధించాలంటే ఆ కల నెరవేరాలంటే

అంబేద్కర్ చిట్ట చివరి కోరిక తీరాలంటే  

మీలో విజ్ఞానం పెరగాలి విప్లవం రావాలి                    

మీ ఐక్యత సఖ్యతే మీకు ఆయుధం కావాలి

మీ ప్రాణాలను ఫణంగా పెట్టాలి 

సింహాలై గర్జించాలి పులులై పోరాడాలి 

రక్తాన్ని చిందించైనా రాజ్యాధికారాన్ని సాధించాలి