Facebook Twitter
అన్నాతమ్ముళ్ళా ఆగర్భశతృవులా?

వారిద్దరూ ఒక చెట్టు కొమ్మలే 

వాళ్లిద్దరూ ఒకతల్లి కన్నబిడ్డలే 

పేరుకే వాళ్లు అన్నాదమ్ముళ్ళు  

నిజానికి వారు బద్దశత్రువులే  

 

వారిమధ్య ఎవరూ

చిచ్చుపెట్టక్కర్లేదు 

ఆరనిచిచ్చు 

వారే పెట్టుకుంటారు 

అగాధాన్ని ఎవరూ

సృష్టించక్కర్లేలేదు 

పూడ్చలేని అగాధాన్ని 

వారే సృష్టించుకుంటారు

 

అడ్డుగోడలు ఎవరూ కట్టక్కర్లేదు 

ఇగోలతో ఇనుపగోడల్ని 

వారే నిర్మించుకుంటారు 

వారి శత్రువులంతా పొత్తులకు 

సిద్ధమంటే వీరు మాత్రం కత్తులు 

నూరుకుంటూ కుత్తుకలు 

త్రెంచుకోవడానికి సిద్దమంటారు

 

పాపం అందరూ వారిని

పావుల్లా వాడుకునేవారే

ఇద్దరిమధ్య విభేదాలు సృష్టించేవారే

వారి అమాయకత్వం అజ్ఞానంవల్లే

వారి ముందు జీవితాలు

కుక్కలు చించిన విస్తర్లౌతున్నాయి

వారి బంగారు భవిష్యత్తులు బలౌతున్నాయి

 

అందుకే ఇకనైనా 

ఈ కంప్యూటర్ యుగంలోనైనా 

అంధులైన అమాయకులైన ఆ

అన్నాదమ్ముళ్ళిద్దరు ఆలోచించాలి

ఇంకెంతకాలం ఈ వెట్టిచాకిరంటూ

చేయచేయి కలిపి పెనమార్పుకు శ్రీకారం చుట్టాలి

 

వారు చైతన్యవంతులుగా మారాలంటే

కోదండరామునికి ఒకే భార్యా ఒకే బాణంలా

ఇద్దరినోట ఒకే మాట ఒకే బాట ఒకే పాట 

వారు బానిస బ్రతుకులనుండి విముక్తి పొందాలంటే

రాజమార్గమొక్కటే ఇద్దరిలో సఖ్యత ఇద్దరిలో ఐక్యతే