Facebook Twitter
మనహక్కుల కోసం పోరాడుదాం!

ఎదిరించే వారులేక

బెదిరించే వారులేక

అడ్డూ అదుపూలేక

అన్యాయాలను

అక్రమాలనుచేస్తూ 

అమానుషంగా

అవహేళనచేస్తూ

అవమానపరుస్తూ

అసమానతలు పాటిస్తూ 

నీచాతి నీచంగా చూస్తూ 

నిరంకుశంగా నిర్దాక్షిణ్యంగా 

పశువుల్లా కౄరంగా ప్రవర్తించే 

వారితోనే మనం నిరంతరం 

పోరాడాలి "ఓపిక‌" ఉన్నంతవరకు

 

సంఘంలో సమానత్వం 

విద్య ద్వారానే సాధ్యం 

మనం సాంఘిక సామాజిక

ఆర్థిక రాజకీయ హక్కులకోసం

స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం

సమానత్వం కోసం సమిష్టిగా 

పోరాడాలి "ఊపిరి" ఉన్నంత వరకు

 

పోయిన హక్కులు పొందడానికి 

నివేదనలు ప్రార్ధనలు పనికిరావని

పోరాడాలని పోరాడి తెచ్చుకోవాలని 

ఓలక్ష్యంతో పోరాడితే పోయేదేమీలేదని

మీతరతరాల బానిసత్వపుసంకెళ్లు తప్పని

"నోరులేని అమాయకపు మేకల్ని బలిస్తారు 

కానీ,ఎదురుతిరిగే పులులనుకాదని" పలికిన

 

ఆ "అంబేద్కర్ అమృత వాక్కులను" 

నిత్యం "ఓ మంత్రంలా" మదిలో జపిస్తూ 

వారి "ఆశయ సాధన" కోసం పరితపిస్తూ

సింహాలై గర్జించడానికి...

పులులై పోరాడడానికి...

ఏనుగులై ఘీంకరించడానికి... 

"రాజ్యాధికారాన్ని" సాధించడానికి...

యుద్దానికి "సైనికుల్లా" సిద్దంగా ఉండాలి