దశాబ్దాలుగా శతాబ్దాలుగా
బానిసత్వంలో మ్రగ్గిపోయిన
ఆరక అంబేద్కర్రగిలే అంటరానితనం
మంటల్లో పడి మాడిమసై పోయిన
ఓ నా బహుజనులారా !
ఓ నా దళిత నాయకులారా !
ఓ నా సోదర సోదరీమణులారా !
మీరు బలహీనులు కాదు బలవంతులు
మీరు బడుగులు కాదు పిడుగులు
మీరు పాలితులు కాదు పాలకులు
మీరు పూరిగుడిసెల్లో పుట్టిన పులులు
అందుకే,
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా
నేటినుండే మీరంతా
కన్నతండ్రుల్లా "ప్రేమించండి"
ఉపాధ్యాయుల్లా "బోధించండి"
సంఘపెద్దల్లా "సమీకరించండి"
సైన్యాధ్యక్షుల్లా యుద్ధభేరి "మ్రోగించండి"
శూరులై వీరులై విజయాన్ని "సాధించండి"
రారాజులై స్వేచ్ఛ, సమానత్వం,
సౌభ్రాతృత్వమే పునాదులుగా
మీ రాజ్యాన్ని మీరే "పరిపాలించుకోండి"
ఆ సుపరిపాలనా అమృత ఫలాలను
అందరికి సమానంగా "అందించండి"
శతాబ్దాలుగా కమ్ముకున్న
బహుజనుల బానిసత్వపు
చీకటి తెరలను "తొలిగించండి"
అస్పృశ్యతా సుడిగాలికి
ఆరిపోయిన దళిత జాతి
జీవితాలను తిరిగి "వెలిగించండి "
ఆశయాల సాధనకై " తపించండి"
ఆదర్శప్రాయులై,"అస్తమించండి"
ప్రపంచమంతా మిమ్ము "ప్రశంసిస్తుంది"
ఈదేశ ప్రజలంతా మిమ్మల్ని "కీర్తిస్తారు"
దళితజాతి మొత్తం
గుండెను గుడిగా చేసుకొని
మిమ్మల్నే ఇలవేల్పులుగా "పూజిస్తారు"
ముందు వేయితరాలు సైతం
మిమ్మల్నే"ఆరాధిస్తారు"
మరువక మీ నామాన్నే నిత్యం "జపిస్తారు"
మన మహర్ పులి
దళితజాతి ఆశాజ్యోతి
బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ రాంజీ
"అంబేద్కర్ ప్రతిరూపాలుగా"
బాహుబలులుగా సదా మిమ్మల్నే "స్మరిస్తారు"
ఇదే మీ అందరికీ ఆశతో అందించే నా అక్షర సందేశం



