Facebook Twitter
పరువు హత్యలు చెయ్యకండి!

ప్రేమికుల ప్రాణాలు తియ్యకండి!

 

అమ్మా తల్లీ అమృతా!

అమ్మా  తల్లీ మాధవీ !!

నిన్నటి వరకు మీరెవరో ఎవరికి తెలియదు

కాని నేడు మీరిద్దరూ గొప్పప్రేమికులని

అంతకు మించి మానవత్వపు

విలువలు ఎరిగిన మానవతావాదులని

కుల రహిత సమాజానికి పునాదిరాళ్ళని

మీరు ప్రేమకు ప్రతి రూపాలైన

ఒక లైలామజ్నుకు

ఒక పార్వతి దేవదాసులకేమి తీసిపోరని

ప్రపంచమంతా మీ ప్రేమను గుర్తించింది

ఒక్క మీ తల్లీతండ్రులు తప్ప

 

అమ్మా తల్లీ అమృతా!

అమ్మా  తల్లీ మాధవీ !!

మీరు పేదవారిని,కులంకానివారిని

ప్రేమించినందుకే, పెళ్ళాడినందుకే

కులరక్కసి మీ పై విషం చిమ్మింది

కన్నవారే కసాయివారై

అడుగడుగున తిట్టి కొట్టి

పగబట్టిన త్రాచుల్లా బుసలుకొట్టి

బాధలుపెట్టి బెదిరించి

కౄరమృగాల్లా వెంటాడి

ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్ని

మంచిగా ప్రేమగా నక్కల్లా నటించి

కోట్ల సుపారీలిచ్చి రిక్కీలు నిర్వహించి

పరువుహత్యలు చేశారు ప్రాణాలు తీశారు

చివరికి నలుగురిలో నవ్వులపాలయ్యారు

జంటలను విడదీసినందుకు జైలుపాలయ్యారు

 

అమ్మా తల్లీ అమృతా!

అమ్మా  తల్లీ మాధవీ !!

స్వచ్చమైన మీ ప్రేమ మాత్రం

చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడింది

ఐనా మీరిద్దరూ

పెద్దకులపోళ్ళ పిల్లలకు

ప్రేమపాఠాలు నేర్పారు

గుంటనక్కల్లాంటి తల్లిదండ్రులకు

గుణపాఠాలు నేర్పారు

అంతేలేని మీ ఆవేదన ఆరాటం అర్ధమైంది

మీ ప్రేమపోరాటంలో ఎంతో న్యాయముంది

మీకు ఓటమి లేదు మీరు ఒంటరివాళ్ళు కాదు

మీకు తోడూనీడగా కొండంత అండగా ఉంటారు అభ్యుదయవాదులంతా అంబేడ్కర్ అభిమానులంతా

 

ఓ అగ్రకుల అహంకారులారా!

ఓ అమ్మా నాన్నలారా !! ఇకనైనా

పరువు హత్యలు చెయ్యకండి!

ప్రేమికుల ప్రాణాలు తియ్యకండి!!