Facebook Twitter
మహిళామణిరత్నం

చదువు విలువ తెలుసుకొని...

చదువు నేర్చుకొని...ఊరికి దూరంగా...

బ్రతుకు భారంగా...చదువు నేరంగా...

ఉన్న నిరుపేదలకు చదువు నేర్పిన

ఓ చల్లనితల్లీ !  ఓ చదువుల సరస్వతీ !

వెలివాడల్లో వెలుగులు

విరజిమ్మిన ఓ విజ్ఞానదీపమా !

మురికివాడలను ముద్ధాడిన

ఓ ఆణిముత్యమా !  ఓ మహిళామణిరత్నమా!

ఓ సావిత్రిబాయి పూలే 

మీకు వందనం ! పాదాభివందనం!!

 

విద్య ఒక అందని ద్రాక్ష

అనుకున్న‌వారికి...అంటరానివారికి....

ఎవరూ వెంటరానివారికి...

అణగారిన వర్గాలవారికి స్వంత ఖర్చులతో...

దూరదృష్టితో...పాఠశాలలెన్నో స్థాపించిన

ఓ ధన్యజీవీ !..ఓ దైర్యశాలి !..ఓ త్యాగశీలి !

ఓ సావిత్రిబాయి పూలే 

మీకు వందనం ! పాదాభివందనం!!

 

విజ్ఞాన దీపం వెలిగించుకొమ్మని..

అజ్ఞాన తిమిరం తొలిగించుకొమ్మని...

ఆత్మగౌరవంతో జీవించమని...

విద్యే అలంకారమని...విద్యే ఆయుధమని...

విద్యే ఔషధమని...విద్యే ఆశాకిరణమని..

విద్యే బడుగు బలహీనవర్గాలకు

బంగారు ఆభరణమని...

సత్సందేశామృతాన్నందించిన

ఓ సద్గుణారాశీ !...ఓ చదువులతల్లీ !

ఓ సావిత్రిబాయి పూలే 

మీకు వందనం ! పాదాభివందనం!!

  

ఓ మహాత్ములారా ! ఓ మహనీయులారా !

ఓ పుణ్యదంపతులారా ! ఓ సంఘ సంస్కర్తలారా !

ఓ ఆదర్శమూర్తులారా !

మీరే మా ఇంటి ఇలవేల్పులు

మీరే మాకు ఆత్మబంధువులు...

మీరు చిరంజీవులు...చిరస్మరణీయులు...

మీ స్మరణే ఓ ప్రేరణ...

మీ అడుగుల్లో అడుగులు వేస్తాం...

మీ ఆశయాలకు అంకితమౌతాం...

 

(ప్రథమ ఉపాధ్యాయురాలు శ్రీ జ్యోతీరావు పూలే సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే వర్థంతి సందర్భంగా)