వద్దు వద్దు మాకొద్దు
బుద్దిని పెంచని బూజుపట్టిన
బృహత్ గ్రంథాలు
మంచిని పంచని మార్పేలేని
మనుస్మృతి మత గ్రంథాలు మాకొద్దు
తోటి మనిషిని తోబుట్టువులా చూడలేని
ప్రక్కన నిలుచోరాదని నీడపడకూడదని
మాట్లాడినా ముట్టుకున్నా మైలపడిపోతారని
కట్టుబాట్లు చేసేవి కంచెలు వేసేవి
వేదాలైతే ఆ వెర్రివేదాలు మాకొద్దు
వద్దు వద్దు మాకొద్దు
ఆస్తికి, ఆయుధానికి, విద్యకు
విజ్ఞానానికి దూరంగా ఉంచేవి
అజ్ఞానాంధకారంలో ముంచేవి
వేదాలైతే ఆ వెర్రివేదాలు మాకొద్దు
వద్దు వద్దు మాకొద్దు
వినబోతే చెవులో సీసంపోసేవి
చదవబోతే నాలుకలు చీరేసేవి
చేతులకు సంకెళ్ళు వేసేవి
కాళ్ళకు బందాలు వేసేవి
కళ్లకు గంతలు కట్టేవి
వేదాలైతే ఆ వెర్రివేదాలు మాకొద్దు
వద్దు వద్దు మాకొద్దు
గొర్రెల్నిచేసి గొంతులు కోసేవి
అవివేకుల్ని చేసి, అణగద్రొక్కేవి
అమాయకుల్ని చేసి, ఆడించేవి
వేధించి, సాధించి, వెతలకు గురిచేసేవి
వేదాలైతే ఆ వెర్రివేదాలు మాకొద్దు
మనువాదుల మట్టిబుర్రలోనుండి
పుట్టిన అట్టి అర్థం కాని అర్థం లేని
వ్యర్థమైన ఆ వెర్రివేదాలు మాకొద్దు
వద్దు వద్దు మాకొద్దు
స్వేచ్ఛను సమానత్వాన్ని
సౌభ్రాతృత్వాన్ని సమాధిచేసేవి
మంచిని మానవత్వాన్ని మంటగలిపేవి
వేదాలైతే ఆ వెర్రివేదాలు మాకొద్దు
అందుకే, తరతరాలుగా
నరనరాల్లో పేరుకుపోయి
నిమ్నజాతి బ్రతుకుల్ని నిర్వీర్యం చేసే
ఈ కులరక్కసి , పీడిత
తాడిత బడుగు బలహీన వర్గాలన్నీ
ఒక సంఘటితశక్తిగా మారి ఒక్క
త్రాటిపై నిలిచి ఢిల్లీలో వున్నా
గల్లీలో వున్నా మనువాదుల
గుండెల్లో గుబులు
పుట్టేలా డప్పులు మ్రోగిస్తూ
జై భీమ్ జై భీమ్ అంటూ
నిప్పులాంటి నినాదాలు చెయ్యాలి
ఎర్రకోటపై నీలిజండా ఎగురవెయ్యాలి



