Facebook Twitter
ఆలోచనలు… అమృత బిందువులు

ఒక్కోసారి మన ఆలోచనలు 

చల్లని పిల్లగాలులౌతాయి 

మదిని పరవశింపజేస్తాయి 

వేడి నిట్టూర్పులై వేధిస్తాయి 

ఎగిరే తారాజువ్వలౌతాయి 

రగిలే నిప్పురవ్వలౌతాయి 

 

ఒక్కోసారి ఆకాశంలో 

విహంగాలై విహరిస్తాయి 

వెన్నెల వెలుగులౌతాయి  

పచ్చని చెట్లౌవుతాయి 

మోడువారిన మొక్కలౌతాయి 

విరబూసిన కుసుమాలౌతాయి 

పాతాళంలోకి జారిపోతాయి 

కమ్మనికాయలై కడుపు నింపుతాయి 

 

ఒక్కోసారి మనలో

పిరికితనాన్ని నూరిపోస్తాయి 

వెయ్యి ఏనుగుల బలాన్నిస్తాయి 

కీర్తికిరీటాలౌతాయి 

మన పతనానికి నాందిపలుకుతాయి

 

ఒక్కోసారి మన ఆలోచనలు

గణగణమని మ్రోగే గంటలౌతాయి 

కణకణమని మండే మంటలౌతాయి 

గలగలమని పారే సెలయేరులౌతాయి 

జలజలమని దూకే జలపాతాలౌతాయి 

 

ఆలోచనలు అంగడిలో 

సరుకు కాదు కొనడానికి

ఆలోచనలే అమృతబిందువులు 

అవే ప్రకృతివరాలు

అవే అంతరంగంలో వెలిగే ఆరనిదీపాలు

అవే ఆ పరమాత్మ తలపులకు ప్రతిరూపాలు