అబ్బాయిల మీద ఆశతో...
బోసినవ్వుల నునులేత బుగ్గల
అందమైన ఆడపిల్లలను మొగ్గలోనే తుంచివేసే
ఏ చెట్లపొదల్లోనో ఏ చెత్తకుండీల్లోనో విసిరేసే
ఏ పందులకో ఏవీధికుక్కలకో ఆహారంగా అందించే
కాస్తన్నా కన్నప్రేమ కనికరము జాలి దయ
సిగ్గులజ్జాలేని కన్నతల్లీదండ్రులంటే...నాకసహ్యం
వయసొచ్చి...
ఏ మాయమాటలకో ఏ మత్తుమందుకో
ఏ ఆకర్షణకోలోనై ఎవరికో మనసిచ్చే
అభంశుభమెరుగని అమాయకపు అమ్మాయిలను
ప్రేమ పేరుతో మోసంచేసే దగాకోరులంటే...
నవ్వించి నట్టేటముంచే నయవంచకులంటే...
నమ్మించి తడిగుడ్డతో గొంతులుకోసే
కసాయివాళ్ళంటే, కర్కోటకులంటే...నాకసహ్యం
నవమాసాలు మోసి ఉన్నతమైన
ఉత్కృష్టమైన మానవ జన్మనిచ్చే
మాతృమూర్తులకు ప్రతిరూపాలైన
నిస్సహాయులైన మహిళలపై మానభంగాలకు
అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలంటే...
కళ్ళు పొరలుకమ్మిన కామాంధులంటే..నాకసహ్యం
ఆడవారిమీద ఆధారపడే వారంటే...
అనవసరంగా అబద్ధాలు ఆడేవారంటే...
మాకేమీ తెలియదు మాకేమీ రాదంటూ
అమాయకంగా నటించేవారంటే...
చైతన్య రహితులై బానిసత్వపు బురదలో
పొర్లాడే దొర్లాడే పిరికిపందలంటే...నాకసహ్యం
నిరంతరం పరులను నిందిస్తూ నిరాశతో
నిట్టూర్పులతో ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసే బద్దకస్తులంటే...నాకసహ్యం
కానీ...ఆశతో...పట్టుదలతో
ఒక లక్ష్యంతో జీవించేవారంటే...
అందుకోసం ముందుకు దూకేవారంటే...
అదృష్టంపైకాక స్వశక్తిపైనే ఆధారపడేవారంటే...
అభివృద్ధిని అభ్యుదయాన్ని ఆకాంక్షించేవారంటే...
నాకిష్టం.....నాకిష్టం.....నాకిష్టం.....ఎంతో.....ఇష్టం...



