హలో అమ్మగారూ
ఎలా వున్నారూ? ఎవరే?
ఏందమ్మ మమ్మల్ని
అప్పుడే మరిచిపోయారా?
మేమమ్మా మొన్న
భారీ అద్దెలు భరించలేక
మీ అందరు దుర్గంధమంటూ
ముక్కు మూసుకుని తిరిగే
మురికి గుంట ప్రక్కన
పందులు తిరిగే సందుల్లో
మునిసిపాలిటీ చెత్త కుండీని
ఆనుకొని వున్న రేకులషెడ్లల్లో
ఇరుకు ఇళ్ళల్లో ఇబ్బందులు పడుతూ
తలదాచుకున్న ఉత్తరాంధ్ర వలసకూలీలం
మేమమ్మా నిన్న
భారీ బిల్డింగులకు,బ్రిడ్జీలకు
ఎత్తైన షాపింగ్ కాంప్లెక్సులకు,
ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ
ఇనుము, సిమెంట్, ఇటుకలు మోసి
ఆరోగ్యం సరిగా వున్నా లేకున్నా
కష్టపడి,చెమటోడ్చి,కడుపు మాడ్చుకొని
ఖరీదైన ఇళ్ళు కట్టిన ఉత్తరాంధ్ర వలసకూలీలం
మేమమ్మా నిన్న మీరు
ఏసీలు వేసుకొని హాయిగా నిద్రపోతుంటే
మేము ఆ పూరిగుడిసెల్లో ఊపిరాడక
దోమతెరలు లేక దొంగదోమలు దాడిచేస్తున్నా
ఆరుబయట,ఆదమరచి నిదుబోయి
వారం తిరగకముందే ఇంటిల్లిపాదీ రోగాలపాలై
ఆసుపత్రుల చుట్ట్టూతిరిగి తిరిగి
ఆరోగ్యం కుదుట పడక అప్పులపాలై
ఉప్పుకుపప్పుకల్లాడిన ఉత్తరాంధ్ర వలసకూలీలం
గుర్తుకు వచ్చామా అమ్మా...
ఈ కరోనా టైం లో కాస్త జాగర్తగా ఉండండమ్మా!
ఉంటా మరి మీ వంటలచ్చిమి...శ్రీకాకుళం...



