Facebook Twitter
ఆ అడవిబిడ్డల జన్మ మాకొద్దు

ఇది ఆగని కన్నీటి ప్రవాహం

ఇది ఆ పుట్టబోయే అడవిబిడ్డలు 

అదృశ్య దైవానికి పెట్టుకున్న 

జన్మదిన ధరకాస్తు

 

అమ్మగర్భంలో

అండాన్ని పిండంగా మార్చి

పుట్టుకతోనే మా బ్రతుకును 

అగ్నిగుండంగా

దినదినగండంగా  

ఒక చిక్కు సమస్యగా

ఒక ప్రశ్నార్థకంగా మార్చే

ఓ దైవమా వద్దు వద్దు

ఆ అడవిబిడ్డల జన్మ మాకొద్దు

 

కన్నీళ్ళతో,కష్టాలతో,కటికచీకటితో

అమాయకత్వంతో తరతరాలుగా

సహజీవనం చేస్తున్నా 

ఎదుగూ బొదుగులేదాయే

ఎన్ని ప్రభుత్వాలు మారినా 

కొండల్లో కోనల్లో తిరిగే ఆ చెంచుల 

బండ బ్రతుకుల్ని మార్చేవారే లేరాయే

వారి వెతలు తీర్చేవారే లేరాయే

వారికి అండగా వుండేవారే లేరాయే

వారిని ఆదరించేవారే లేరాయే

వారి మీద కనికరమెవరికీ లేదాయే

వారి జీవితాలను వెలుగుమయం

చేయాలన్న ఆలోచనే ఎవరికీ రాదాయే

వారి శ్రేయస్సు సంక్షేమం ఎవరికీ పట్టదాయే

అందుకే ఓ దైవమా వద్దు వద్దు

ఆ అడవిబిడ్డల జన్మ మాకొద్దు

 

ఆ అడవి అమ్మానాన్నల కడుపున పుట్టి

అరకొర విద్య వైద్య వసతులుండే  

ఆ చెంచుగూడేలలో 

ఆ గుడిశల్లో ఆడుకునేకన్నా

అజ్ఞానంతో పెరిగే కన్నా 

ఆకలికి అలమటించేకన్నా 

ఆ బురదనీరు త్రాగేకన్నా

ఆ కొండతేనె తినేకన్నా

అంతుచిక్కని ఆ రోగాలతో 

రోజూ పోరాడే కన్నా

ఆకారడవిలో ఆ కటికచీటిలో ఆ 

ఆ కౄరమృగాల మధ్య 

ఆ విషసర్పాల మధ్య 

క్షణక్షణం భయంతో రోజూ 

ఛస్తూ బ్రతికే కన్నా ,కనీసం

ఆ అడవిజంతువుల కడుపున పుట్టినా

కొంత సుఖంగా  కొంత ప్రశాంతంగా

సంతోషంగా సంతృప్తిగా హాయిగా 

ఆనందంగా బ్రతకవచ్చునేమో

స్వేచ్ఛగా తిరగవచ్చునేమో

అందుకే ఓ దైవమా వద్దు వద్దు

ఆ అడవిబిడ్డల జన్మ మాకొద్దు