చీకటి
దృశ్యమొకటి
చిరునవ్వు నవ్వింది
ఊబిలో నుండి నా
నాభిలోనుండి
ఊపిరి ఉప్పెనై
కన్నీటి కడలిలో
కలవరం రేపుతుంది
సమాధిలో శవంలా
ధ్యానంలో వుంది
పండనిపొలం
గట్టుమీద ఓచెట్టు
కొమ్మలు రెమ్మలు
విరిగి నేలకు
ఒరిగిపోయింది
చెట్టుమీద పిట్టొకటి
పైకి లేసి కాసేపు
రెండు రెక్కలు
రెపరెలాడించింది
ఐతే...
చీకటిలో ఏమిటో
ఆ చితిమంటలు
ఎంతకూ
అంతుచిక్కడంలేదు
నాకర్థమైంది ఒక్కటే
ఆగంతకుడొకడు
బ్రతుకు చిత్రాన్ని
బంగారు రంగులతో
చీకటిలో గీస్తున్నాడు
ఎవరో వాడి
వెనుక నీడలో
నిలబడి నిప్పులు
చెరుగుతున్నాడు
ఆ రంగులు
చెరుపుతున్నాడు
కాలంతో పాటు
వాడు కరుగుతున్నాడు
ఎందుకో నేను అర్దరాత్రి
నిద్రనుండి మేల్కొనిచూడగా
నా నీడ నన్నుచూసి నవ్వింది..



