నీకు నాకు
తెలియని నిజమిది
నీళ్ళు నడుస్తాయని...
నీళ్ళు ఏడుస్తాయని...
నీళ్ళు నవ్వుతాయని...
నీళ్లు నిద్రపోతాయని...
నీళ్ళు ఎగురుతాయని...
నీళ్ళు పరుగుతీస్తాయని...
నీళ్ళు నిట్టూర్చుతాయని...
నీవు నీళ్లలో మునిగి
తిరిగి తేలాలనుకుంటే
నీవు నీళ్ళపై పడుకుని
నిదురపోవాలనుకుంటే
నీవు సజీవమైతేనే అది సాధ్యం
నీవు నిర్జీవమైతే నీటిలో మునగలేవు
నీటిపై తేలియాడూతూ ఉండాల్సిందే
ఆగని అలలొచ్చి ఛీఛీ పోపో అంటూ
గడ్డిపోచలా నీకట్టెను గట్టుకు విసిరేస్తాయి
కనిపించిన ప్రతిదాన్ని
కాల్చివేయడం నిప్పుచేసే తప్పు
అందుకే నీళ్లంటే నిప్పుకు భయం
కానీ ఆ నీళ్ళే మనిషికి జీవనాధారం
ఆ నీళ్లే నిప్పైతే మనిషి బ్రతుకు నరకం
పాపం సముద్రంలోని
ఆ నీళ్లకేం తెలుసు? అవిఏడుస్తాయని...
తాము ఎవరి దాహం
తీర్చలేని నిస్సహాయులమని
కడలి కడుపులోనే కలకాలముండాలని
పాపం సముద్రంలోని
ఆ నీళ్లకేం తెలుసు ?అవి నిట్టూర్ఛుతాయని...
తాము తీరందాటితే ప్రళయమేనని
ఎన్నో ప్రాణాలు హరీ అంటాయని
ఊళ్ళుఊళ్ళే ఊడ్చిపెట్టుకు పోతాయని
పాపం సముద్రంలోని
ఆ నీళ్లకేం తెలుసు ? అవి నిద్రపోతాయని...
అలలు అలిసిపోయినప్పుడు
అల్లకల్లోలమైన సముద్రం చల్లబడినప్పుడు
అది ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడు
పాపం సముద్రంలోని
ఆ నీళ్లకేం తెలుసు ? అవి ఎగురుతాయని...
అప్పుడప్పుడు ఆకాశంలో విహారయాత్రలకెళ్లాలని
మేఘాల్లో విహరించాలని విశ్వమంతా విస్తరించాలని
పాపం సముద్రంలోని
ఆ నీళ్లకేం తెలుసు ? అవి నవ్వుతాయని...
చినుకులైరాలి నేలపై ప్రవహించినప్పుడు
సాగు త్రాగునీరై పశువుల పక్షుల పంటపొలాల
సృష్టిలోని సకలజీవరాశుల దాహార్తిని తీర్చినప్పుడు
పాపం నీళ్లు అమాయకంగా అడుగుతాయి
నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగన్నది నిజమేనా అని
నిజమేనంటే నవ్వినీళ్ళు పక్షుల్లాఎగురిపోతాయి నింగిలోకి



