Facebook Twitter
ఎవరికెరుక...ఆ పరమాత్మకు తప్ప...

నిన్న గుబాళించి నేడు నేలరాలే 

ఆ పువ్వులెందుకు పుష్పించాలి?

 

నిన్న పండి నేడు ఎండిపోయే 

ఆ ఫలాలెందుకు చెట్టుకు కాయాలి?

 

నిన్న వెలిగి నేడు ఆరిపోయే 

ఆ ప్రమిదలపై ప్రేమ ఎందుకని?

 

నిన్న పుట్టి నేడు గిట్టే 

ఆ నీటిబుడగవంటి జీవితమెందుకని ?

 

అంతలోనే పుట్టి అంతలోనే వాడే

ఆ పూలల్లో ఎన్నిపూలు గుడికి చేరి 

దేవుని మెడలో హారాలై తమ జన్మను 

సార్థకం చేసుకుంటాయో ఎవరికెరుక ?

 

అంతలోనే పండి 

అంతలోనే ఎండిపోయే ఆ ఫలాలు

ఎందరి కడుపులు నింపుతాయో

ఎందరి ఆకలిని తీరుస్తాయో ఎన్ని 

జీవితాల్లో ఆశల్ని నింపుతాయో ఎవరికెరుక?

 

అంతలోనే వెలిగి అంతలోనే ఆరిపోయే 

ఆ దీపాలు ఎందరికి వెలుగునిస్తాయో

ఎందరి జీవితాలను వికసింపచేస్తాయో ఎవరికెరుక?

 

అంతలోనే పుట్టి అంతలోనే గిట్టే ఈ మనుషుల్లో 

ఎందరు విశ్వవిజేతలౌతారో

ఎందరు ఖండాంతర ఖ్యాతినార్జిస్తారో 

ఎందరు చరిత్రలో చిరంజీవులౌతారో ఎవరికెరుక?