Facebook Twitter
సూర్య సందేశం...

నేను సూర్యున్ని

చీకటి నా శాశ్వత శత్రువు

చీకటి నన్ను చూసినవ్వినా

చిమ్మచీకట్లు కమ్ముకున్నా

నాకు చింతలేదు, లేనేలేదు

ఈ చీకట్లను చీల్చుకుంటూ

వెలుగులు విరజిమ్ముకుంటూ

రేపు ఉదయమే నేను ఉదయిస్తాను

 

ఈ కారుమబ్బులు

కలకాలం వుండవులే

ఈ కారుచీకట్లు శాశ్వతం కాదులే

ఈ కరోనా రాక్షసి కూడా అంతేలే

 

ఓ మనిషీ "భయపడకు"

క్షణక్షణం భయపడుతూ

భారంగా మాత్రం బ్రతకవద్దు

కొండంత ధైర్యంతో

గుండె నిండా "ఆశతో" 

గట్టి నమ్మకంతో "జీవించు"

ధైర్యమే నీ "దారిలో దీపం"

ఆశే నీకు "ఆయుధం ఔషధం"

నమ్మకమే నీకు "రక్షణ కవచం" 

 

విశ్వమంతా విస్తరించి

విర్రవీగుతూ వికటాట్టహాసంతో

ఎంతగా కరాళనృత్యం చేస్తున్నా

ఎందరిని నిర్దాక్షిణ్యంగా కబలించినా

ఏ మందో మాకో త్వరలో "రాక తప్పదు"

కనిపించని ఈ కరోనా "కన్ను మూయక తప్పదు"

కారుచీకటిలో "కాలగర్భంలో కలిసిపోక తప్పదు"

 

"ఉందిలే మంచి కాలం ముందు ముందునా"

"అందరూ సుఖపడాలి నందా నందనా"అంటూ   

ఉత్సాహంగా పాడుకోండి ! ఉపశమనం పొందండి ! ఇదే

ఇదే "అస్తమించే ఆ సూర్యుడందించే మధుర మంజుల 

మనోహర సుందర సుమధుర శుభకర "సూర్య సందేశం"