Facebook Twitter
గుండె జబ్బు

అబ్బోఅబ్బో అదేమిజబ్బో ఏమో 

మన శత్రువులకు కూడా రాకూడదు 

అని కోరుకునే కొందరు ఆరోగ్యవంతులు 

ఆ జబ్బే తమకు రావాలని ఆశిస్తారు దాన్ని

ఆశతో ప్రేమతో ఆహ్వానిస్తారు ఎందుకు?

 

నిజమే ఆ ఆలోచన ఒక వింత విచిత్రమైనదే కాని 

ఆ ఆశ వెనుక ఒక అర్థమున్నది ఆవేదన వున్నది

 

కన్నబిడ్డల ఆదరణే అందని ద్రాక్షైననాడు 

ఏ దిక్కూమొక్కూలేక అనాధలైపోయిననాడు 

కన్నవారు,కట్టుకున్నవారే కాటికి పొమ్మన్ననాడు 

ప్రేమపూర్వకమైన పలకరింపులు కరువైననాడు

 

అన్నీ జీవితంలో అనుభవించినవారికి

నిర్దాక్షిణ్యంగా తాను నిర్లక్ష్యానికి గురైనవారికి 

మంచంలోపడి మానసిక క్షోభననుభవించేవారికి

ఎందుకు నాకీ మందుల బ్రతుకనుకున్నవారికి

 

ఆ జబ్బే వస్తే ఉన్న చింతలన్నీ చిటికెలో మాయం

అదే గుట్టూచప్పుడు కాకుండా వచ్చే గుండెజబ్బు

 

ఎవ్వరికీ ఎటువంటి భారం కాకుండా 

అందరికి దూరంగా వెళ్ళాలనుకున్నవారికి

ఆరోగ్యమే మహాభాగ్యమన్న ఆశ లేనివారికి

కానీఖర్చులేకుండా కన్ను మూయాలనుకున్నవారికి

 

ఆ జబ్బే వస్తే ఉన్న చింతలన్నీ చిటికెలో మాయం

అదే గుట్టూచప్పుడు కాకుండా వచ్చే గుండెజబ్బు

 

జీవితంలో బరువుబాధ్యతలన్నీ తీరిననారికి

అందరి కళ్ళముందే తిరుగుతూ తిరుగుతూ 

నలుగురితో మాట్లాడుతూ మాట్లాడుతూ 

కన్నుమూసి కాటికెళ్ళడం ఒక వరమనుకున్ననారికి

 

ఆ జబ్బే వస్తే ఉన్న చింతలన్నీ చిటికెలో మాయం

అదే గుట్టూచప్పుడు కాకుండా వచ్చే గుండెజబ్బు

 

రోజూ పూజలుచేయడం గుళ్లూగోపురాలు తిరగడం  

దేవుళ్ళందరికి మొక్కడం ఆశతో ఎదురుచూడడం  

అదేవస్తే పరలోకమెళ్ళి పరమాత్మలోలీనమైపోవడం

పూర్వజన్మ సుకృతం అది ఎన్నోజన్మల పుణ్యఫలం