చిరునవ్వులే చిరుజల్లులు
ముసిముసి నవ్వులు
రువ్వే అధరాలు
ఎదలో చెరగని ముద్రలు వేస్తాయి
నవ్వే పెదవులు
నలుగురిని నీ చెంతకు చేరుస్తాయి
నీకు స్వాంతన కలిగిస్తాయి
మధువొలకబోసే అధరాలు
మృదుమధురమైన మాటలు పలుకుతాయి
అవి ఎదలోతుల్ని తాకుతాయి
గుండెల్లో ఆరని మంటల్ని ఆర్పుతాయి
మానని గాయాలకు మందులౌతాయి
చెదరని స్నేహానికి బంధాలకు అనుబంధాలకు
పెదవులే తీయని పదాలతో ప్రాణం పోస్తాయి
కానీ ఆ అనురాగాలు ఆవిరై
అంతరంగం అల్లకల్లోలమైతే
గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలైతే
కళ్ళు కన్నీటి వరదలైతే
చిరునవ్వుల పువ్వులు పూసి
మనకు మధురానుభూతిని మిగిల్చిన
ఆ ఆధరాలే చివరకు
చిగురుటాకుల్లా వణుకుతాయి
ఐనా పెదాలలో ప్రేమ ఉంది
అధరాలలో అమ్మ వుంది
అధరాలలో అందముంది
అధరాలలో అమృతముంది
అధరాలే మనకు ఆయుధాలు అవే
అనేక మానసిక రుగ్మతలకు ఔషధాలు



