Facebook Twitter
కాపురంలో కారుచిచ్చు రేగితే ?

ఎప్పుడూ ఇద్దరూ

ఎదురెదురుగా కాదు

ప్రక్క ప్రక్కనే కూర్చొని

సరదాగా మాట్లాడుకోవాలి 

సంతోషంగా వుండాలి

సంబురాలు చేసుకోవాలి

ఒకరిపై మరొకరు అంతులేని

ప్రేమానురాగాల్ని ఆప్యాయతల్ని

కుంభవర్షంలా కురిపించుకోవాలి, అంతే

 

కానీ, పెద్దగొంతుతో ఎవరు మాట్లాడకూడదు

కాకుల్లా అరవకూడదు గద్దల్లా పొడవకూడదు 

కుక్కల్లా మొరగకూడదు పాముల్లా కరవకూడదు 

ఎత్తిపొడుపు మాటలేవీ మాట్లాడుకోకూడదు 

 

మనసు కళుక్కుమనేలా 

కత్తులతో పొడిచినట్లుగా 

సూదులతో గుచ్చినట్లుగా 

పుండు మీద కారం చల్లినట్లుగా 

సూటిపోటి మాటలు మాట్లాడుకోకూడదు  

 

ఒకరిని మరొకరు పురుగులా చూడకూడదు  

ఎదురుపడితే "ఛీ" అంటూ మూతి 

ముడుచుకోకూడదు ముఖంతిప్పుకోకూడదు 

నంగనాచిలా నటించకూడదు 

వెకిలినవ్వు నవ్వకూడదు వేధించకూడదు

 

పొద్దస్తమానం  పోట్లాడుకోకూడదు 

జుట్లు పట్టుకుని కొట్లాడుకోకూడదు

విడిపోదాం - విడిపోదాం - విడిపోదాం

విడాకులు తీసుకుందాం తక్షణమే

విడాకులు తీసుకుందాం అంటూ 

అదేపనిగా పదేపదే అనకూడదు 

 

మదిలోరగిలే అపార్ధాల మంటలు 

ఆరవని అనుమానపడకూడదు 

ఒకరినొకరు అవమానపరచుకోకూడదు 

కలసిక ఉండలేం కాపురం చెయ్యలేం

అతకని మనసులతో 

ఈగతుకుల బ్రతుకుబండిని లాగలేం

అని చతికిల పడిపోకూడదు

 

అందుకే మనమధ్య

గట్టిగా అడ్డుగోడలు నిర్మించుకుందాము

పెంచుకున్న అనుబంధాలన్నీ తెంచుకుందాం

దూరంగా సుదూరంగా వెళ్లిపోదాం అనుకోక

 

వివాదం ముదిరి విడిపోతే విషాదమేనని

కలిసిఉంటేనే కలదు సుఖము,శాంతియని

 

దంపతులందరికీ

ఓ హామీనిద్దాం హాయిగా వుండమని

ఓ సందేశాన్నిద్దాం సంతోషంగా వుండమని

ఓ శుభ సందేశాన్నిద్దాం సుఖంగా వుండమని