నేడు మీరు
మీ స్నేహితులనుండి
అతిగా ఏదీ ఆశించవద్దు
రేపు మీరు ఆశించింది
అందవచ్చు అందకపోవచ్చు
చెందవచ్చు చెందకపోవచ్చు
ఐనా మీరు మీకోరిక తీరలేదని
ఆవేదన చెందవద్దు
ఆందోళనకు గురికావద్దు
ఆత్మ హత్యలు చేసుకోవద్దు
పగకు ప్రతీకారానికి పూనుకోవద్దు
మీకు మీరే శత్రువులుగా మారవద్దు
నేడు మీరు ఎవరినీ
అతిగా నమ్మవద్దు
అతిగా ఇష్టపడవద్దు
అతిగా ప్రేమించవద్దు
రేపు మీరు ప్రేమించినవారే
మీకు దక్కవచ్చు దక్కకపోవచ్చు
మిమ్మల్ని అకారణంగా ద్వేషించవచ్చు
ఐనా మీరు పిచ్చిప్రేమతో,వ్యధకు
వేదనకు మానసికక్షోభకు గురికావద్దు
ఉరివేసుకోవచ్చు ఊపిరి తీసుకోవద్దు
నేడు మీరు ఎవరితోనూ
అతిగా చొచ్చుకొనిపోవద్దు
రేపు వారే మీకు గేటు
తియ్యవచ్చు తియ్యకపోవచ్చు
తీసినా మిమ్ము వెలుపలికి గెంటివేయవచ్చు
నేడు మీరు ఎవరికోసమూ
అతిగా నిరీక్షించవద్దు, రేపు మీరు
నిదురకాసి ఎదురు చూసినవారే
రావొచ్చు రాకపోవచ్చు రాలేకపోవచ్చు
ఐనా మీరు నిరీక్షించి నిరాశ చెందవద్దు
ఉద్వేగానికి గురికావద్దు ఊపిరితీసుకోవద్దు
ఒక్కసారి నమ్మకం సహనం నశిస్తే విచక్షణకోల్పోతాం
విచక్షణే కోల్పోతే ఇక విషాదమే వినాశనమే విధ్వంసమే



