కలలుగనే...
"కన్నెపిల్లలకు" తెలియదు పాపం
తీరందాటితే తుఫానని
కాలుజారితే కన్నీరేనని...
ఎగిసిపడే...
"అలలకు" తెలియదు పాపం
తీరందాకే తమ పయణమని
తిరిగిరాక తప్పదని...
చెరువులో తిరిగే..
"చేపలకు" తెలియదు పాపం
గట్టెక్కితే తమకు గండమేనని...
ఒడ్డుచేరితే
తమబ్రతుకు ఒక్కక్షణమేనని...
రెక్కలు ముక్కల్ చేసి
మొక్కలు పెంచే...
"వనమాలికి" తెలియదు పాపం
పూసిన పూలన్నీ పూజకేనని...
పండిన పళ్ళన్నీ పరులకేనని...
ఆకలిగొన్న అమాయకపు...
"మేకకు" తెలియదు పాపం
నేడు ఆకులువిసిరి ఆకలితీర్చేది
తనకు ప్రేమతో ఇంత తిండిపెట్టేది
తిరిగి రేపు తనను తినడానికేనని......
వొంగివొంగి నాయకుడు
దండాలుపెడుతోంటే
పొంగిపొంగిపోయే...
"ఓటరుకు" తెలియదు పాపం
కుర్చీలో కూర్చోగానే
నాయకుడు కుబేరుడౌతాడని...
తానుమాత్రం ఆకలితో
అలమటించే అస్తిపంజరమేనని...
రాత్రింబవళ్లు గొడ్డుచాకిరీ చేసే...
"ఉద్యోగికి" తెలియదు పాపం
అడ్డదారిలో
ప్రమోషన్లైపోతుంటాయని...
గోడమీది పిల్లులు
మేడమీదికెళ్తుంటాయని...
అందుకే ఓ శ్రమజీవి ! నీవు మాత్రం
పట్టువదలక..... పదముందుకు !
ఫలితం దక్కలేదని వ్యధ చెందకు !!
నిప్పు నెవ్వరు మూట కట్టలేరు
ప్రతిభ నెవ్వరు ప్రక్కకు నెట్టలేరు
చేసిన ధర్మం.......చెడని పదార్థం
ఇది ముమ్మాటికీ పచ్చియదార్థం
ప్రతిభకు ఎప్పటికైనా పట్టాభిషేకమే !
కష్టజీవికి ఏనాటికైనా కనకాభిషేకమే!
అందుకే ఓ కష్టజీవి ! నీవు మాత్రం
పట్టువదలక...... పద ముందుకు !
ఫలితం దక్కలేదని వ్యధ చెందకు !!



