కల్లబొల్లి కబుర్లు తియ్యగా
కాకమ్మకథలు కమ్మగా చెప్పి
నమ్మించి నవ్వుతూ నట్టేటముంచే...
నయవంచకులను... కంత్రీగాళ్ళను...
వద్దురా... వద్దురా... నమ్మొద్దురా
కంటబడగానే పెంటమీద పైసాసైతం
పరుగెత్తికెళ్ళి తీసిదాచుకునే నీచులను...
పిల్లికిగాని... దానిపిల్లకుగాని....
పిడికెడు బిక్షం... పెట్టని పిసనారులను...
వద్దురా... వద్దురా...నమ్మొద్దురా
అన్నాతమ్ముళ్లను అమ్మానాన్నలను
అక్కాచెల్లెళ్లను దూరపుబంధువులను
ఇంటికి పిలిచి ప్రేమతో ఇంత తిండిపెట్టి
గుట్టుగా లెక్కలు వ్రాసుకునే...
గుంటనక్కలను... ఆశబోతులను...
వద్దురా... వద్దురా... నమ్మొద్దురా
మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు ?
మా ఇంటికివస్తే ఏమితెస్తావు ?
అన్నసూత్రాన్ని తూ.చ.తప్పక
పాటించే పరమదరిద్రులను...
దౌర్భాగ్యులను...దగాకోరులను...
వద్దురా... వద్దురా... నమ్మొద్దురా...
అన్న పోలన్న సుభాషితం !
విన్నజీవితం సువర్ణశోభితం !!
ఎప్పుడూ ఆనందంగానే వుండు
అనవసరంగా ఆందోళన చెందాడు
నిదానమే ప్రధానం అన్నది నిన్నటి మాట
ఈకంప్యూటర్ యుగంలో వేగమే ప్రధానం
ఒకింట పేదవాడిగా పుట్టడం తప్పు కాదు
కానీపెదవాడిగా మరణించడమే పెద్దనేరం
చిరునవ్వులే చీకటిలో వెలిగే చిరుదీపాలు
కోపతాపాలే తీరనిశాపాలు నరకకూపాలు
ప్రతినిత్యం మరువకు సత్యమునే బోధించు
నటించకు నిన్నునమ్మినవారిని నట్టేటముంచకు
పురోభివృద్ధికే నీ ఆలోచనలు పునాది కావాలి
సమయాన్ని సత్సంకల్పాలను సమాధిచేయకు
ఏనాడైనా ఎవరిని కూడా భయపెట్టకు బాధించకు
ఎప్పుడైనా ఎవరైనా ఆపదలోవుంటే తక్షణమే ఆదుకో
బిందువులే సింధువైనట్లు నేటిపొదుపే రేపటిమదుపు
దేనినీ నేడు వృధా చేయకు రేపు లేదని వ్యధ చెందకు
కదలని మెదలని ఉలుకు పలుకులేని శిలలా వుండకు
నిరంతరం ఉవ్వెత్తున ఎగిసిపడే కడలికెరటంలావుండు
ఇష్టంతో నేడు పేదలకు అనాధలకు ఇచ్చువారు
రేపు ఆ పరమాత్మ నుండి పుష్కలంగా పుచ్చుకుంటారు
ఎప్పుడైనా ఏనాడైనా పడినా సరే పైకి లేవడానికి
పక్షిలాఎగరడానికి మొక్కలాఎదగడానికే ప్రయత్నించు
ఏనాడు విడిపోవడానికి చెడిపోవడానికి పాతాళంలో పడిపోవడానికి పతనమైపోవడానికి మాత్రం ప్రయత్నించకు
ప్రతివారిని ప్రేమించు అందరిలో ఆ దైవాన్ని దర్శించు
ఎవరినీ అకారణంగా ద్వేషించకు దెయ్యాలుగా ఊహించకు



