Facebook Twitter
ప్రకృతి పుస్తకంలో...

ప్రకృతి పుస్తకంలో

ఆకు, పువ్వు, మేఘం

మూడు పేజీలను తిరగేస్తుంటే...

 

ఒక ఆకు... 

రాలిపోతూ చెప్పింది

ఈ జీవితం అశాశ్వితమని

ఒక ఆకు చిగురిస్తూ చెప్పింది

చిగురంత ఆశ వుంటే చాలు

ఈ జీవితం సుఖమయమేనని..

 

ఒక పువ్వు... 

వాడిపోతూ చెప్పింది

మనిషి పుట్టింది గిట్టడానికేనని  

మట్టిలో కలిసిపోవడానికేనని

ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది

ఒక్కరోజైనా మనిషి బ్రతుకు 

గుభాళించాలని గుర్తుండిపోవాలని...

 

ఒక‌ మేఘం... 

వర్షిస్తూ చెప్పింది

చెడును స్వీకరించమని 

మంచిని పదిమందికి పంచమని

కరగని ఒక మేఘం చెప్పింది

చల్లని గాలితో స్నేహం 

చెడిపోరాదని కారణం 

తాను కదిలేది, కదిలి, కరిగేది

కరిగి, కురిసేది గాలివల్లనేనని...