ఓ మిత్రులారా !
వస్తున్నా నే వస్తున్నా !
అవసరమైతే సునామీని సృష్టిస్తా !
మట్టినుండి మాణిక్యాలను వెలికితీస్తా !
విజ్ఞానపు విత్తనాలను విశ్వమంతా విసిరేస్తా !
ఉరుములకు మెరుపులకు ఊపిరిపోస్తా !
జాలిదయల తొలకరిజల్లుల్ని చిలకరిస్తా !
కరుణ ప్రేమల కుంభవర్షాలను కురిపిస్తా !
మోడువారిన మొక్కల నుండి
గుభాళించే గులాబీ పువ్వులను పూయిస్తా !
ఏడువర్ణాల స్నేహలతల
ఇంద్రధనస్సుకు ఇంపైన ఇరవైరంగులను చిత్రిస్తా !
అవినీతి తిమింగలాల భరతం పడతా!
బంగాళాఖాతంలో కలిపేస్తా !
సంఘవిద్రోహశక్తుల్ని సాగరగర్భంలో ముంచేస్తా !
మహిళల మానాలను హరించే
మానవ మృగాలను మట్టుపెడతా !
కామాంధులను కాల్చివేస్తా !
ఆకాశమార్గాన విహంగమై స్వేచ్ఛగా వివరిస్తా !
వీనులవిందైన విషాదసంగీతం వినిపిస్తా !
తీయని జ్ఞాపకాలను మీకు తినిపిస్తా !
ఎవరెస్ట్ శిఖరంపై అభ్యుదయజెండానెగరవేస్తా !
విధిని ఎదిరిస్తా ! విజయాన్ని సాధిస్తా !
చల్లని ఆ జాబిల్లి గుండెల్లో నిశ్చింతగా నిదురిస్తా !
మీ ఇంటికి వస్తా ! మీ గుండెగోడలపై
జ్ఞాపకాల సంతకం చేస్తా!
వస్తున్నా నేవస్తున్నా మీ ఊరు వస్తున్నా!



