విశ్వవిజేతవై విజయఢంకా మ్రోగించు
ఈ సృష్టిలో
అన్ని జన్మలకన్నా
ఉన్నతమైనది
ఉత్కృష్టమైనది
ఈ మానవజన్మే
అందుకే ఓ మనిషి!
నిన్ను నీవు తెలుసుకో
నీలోకి నీవు తొంగి చూడు
నీలో ఉన్నవి శక్తులు మూడు
నీ శరీరం నీ మనసు నీ ఆత్మ
ఇది పచ్చినిజం నీలోవుంది
ఆత్మ అనే ఒక అఖండజ్యోతి
ఆ సత్యమే తెలుసుకుంటే
ఆర్జిస్తావు నీవు ఖండాంతర ఖ్యాతి
నిజానికి
నీవు ఓటి కుండవు కాదు పాలకుండవు
నీవు చీమవు కాదు సింహానివి
నీవు జింకవు కాదు చిరుతపులివి
నీవు ఎలుకవు కాదు ఏనుగువు
నీవు శిలవు కాదు శిఖరానివి
నీవు వ్యక్తివి కాదు ఒక దివ్యమైనశక్తివి
పదిసార్లు పడినా సరే పైకి లేస్తావు
నేడు ఓడినా రేపు నీవు గెలుస్తావు
ఓడిపోవడానికి కాదు కాదు
జయించడానికే నీవు జన్మించావు
అందుకే ఓ మనిషీ!
భయమెందుకు? సందేహమెందుకు?
ఆశే శ్వాసగా సాగిపో ముందుకు
విశ్వవిజేత వయ్యేందుకు
విజయఢంకా మ్రోగించేందుకు.....



