గెలుపు ఓటములు దైవాధీనములే
ఐనా ఓటమి అంచుకు చేరినా సరే
నీ ఆత్మవిశ్వాసాన్ని వదులు కోవద్దు
విజయమో అపజయమో కరాఖంఢిగా
ఖచ్చితంగా తేలేది చిట్టచివరి నిముషంలోనే
పోటీ కొనసాగు తున్నంతసేపు
నీవు విజయం వైపే చూడాలి
ఓటమిని మనసులో తలంచరాదు
దాని వైపు చూడరాదు
ఆత్మవిశ్వాసం కోల్పోరాదు
నిరాశను దరిచేర నియ్యరాదు
రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకాలి
దూకుడును పెంచాలి
పట్టుదలతో, కనపడని కసితో
చిట్టచివరి నిముషం వరకు శ్రమించాలి
స్వేదాన్ని చిందించాలి
ఆరునూరైనా సరే ఓటమిని ఒప్పుకోరాదు
అర్జునుడికి చెట్టు కొమ్మల్లోని
పక్షి మాత్రమే కనిపించినట్లు
కప్పు మాత్రమే నీ కళ్లకు కనిపించాలి
దాన్ని దక్కించుకోవడానికి నీవు కష్టపడాలి
అన్ని రకాలుగా ప్రణాళికా బద్దంగా,
ఒకరి ప్రేరణతో, నీపై గట్టినమ్మకంతో
శతవిధాలా ప్రయత్నించాలి కృషి చెయ్యాలి
ఆఖరు క్షణంవరకు
ఆత్మవిశ్వాసమే నీఆయుధం కావాలి
ఆపై విజయలక్ష్మి పరుగులు
పెట్టేది నీ వెంటే
ప్రశంసల కుంభవర్షంలో
తడిసిముద్దైపోయేది నీవే
సభలు సమావేశాలు
సన్మాలు సత్కారాలు
అంబరాన్ని తాకే సంబరాలు నీకే



