Facebook Twitter
పరమ పవిత్రం.. తిరుపతి ప్రసాదం…

నిన్న...
తింటే...గారెలే తినాలి
వింటే... మహా భారతమే వినాలి
అన్నవారే...

నేడు...
తింటే...తిరుపతి లడ్డే తినాలి
వింటే...మహా భారతమే వినాలి
కంటే... ఆడపిల్లనే కనాలి
కొంటే...కంచి పట్టుచీరలే కొనాలి
అంటున్నారు...

ఔను "తిరుపతి లడ్డు" అంటే
"పరమ పవిత్రమైన దైవప్రసాదం"
"ఆ ప్రసాదం ఒక దివ్య ఔషధం"

అట్టి ప్రసాదం
వెంట తెచ్చుకుంటే...
లేగదూడ వెంట
తల్లి గోమాత వచ్చినట్లు...
ప్రసాదంతో పాటు ఆ శ్రీహరి సైతం
తమ ఇంటికొస్తాడని భక్తుల విశ్వాసం

నోరూరించే ఘుమ ఘుమలాడే
"మహా ప్రసాదం"చూడగానే
కళ్ళల్లో........ఒక కాంతి
ముఖంలో....ఒక మెరుపు
పెదవులపై...ఒక చిరునవ్వు
తాండవిస్తుంది...తప్పక...

ఆహా ఏమి రుచి..? ఏమి రుచి..?
ఓహో ఏమి సువాసన..?
ఏమి సువాసన..? అంటూ
కళ్ళకద్దుకొని...తింటూ వుంటే...
కాసేపు కళ్ళు మూసుకొంటే...
మదిలో శ్రీహరిని స్మరించుకుంటే...

తిరుమలనొకసారి దర్శించినంత
ఆత్మతృప్తి మనిషికి కలుగుతుంది
అనంతరం పరవశించి పోతుంది
ఆ ఆనందం...ఆ సంతోషం...
వర్ణనాతీతం అది అనుభవైకవేధ్యం..!
అంతటి ప్రాశస్త్యమైనది ఆ నైవేద్యం..!