నా...రంగులు...రెండు...
ఆకారం పాల తెలుపు...
అంతరంగం కారు నలుపు...
నన్ను...పోలినవి...రెండు...
గోడ మీది తెల్లని పిల్లి...
రంగులు మార్చే ఊసరవెల్లి...
నా...కోరికలు...రెండు...
తీరని ధన దాహం...
తరగని పదవీ వ్యామోహం...
నా...సలహాలు...రెండు...
అందితే జుట్టు పట్టు...
అందకపోతే కాళ్ళు పట్టు...
నా...లక్ష్యాలు...రెండు...
పక్షపాతం చూపించడం...
రక్తపాతం సృష్టించడం...
నా...ట్రిక్కులు...రెండు...
పరమ శతృవును
సైతం పలకరించడం...
కడుపులో కత్తులుంచుకొని
కౌగిలించుకోవడం...
ఈపాటికి నేనెవరో
మీకు తెలిసే ఉంటుంది
కానీ నేనంటే గిట్టనివారు
నాపై నిందల నిప్పులు పోస్తారు
నేను...
వాగ్దానాల వర్షం కురిపిస్తానని...
అరచేతుల్లో స్వర్గం చూపిస్తానని...
ఏరు దాటాక తెప్ప తగలేస్తానని...
ఓట్లు రాగానే ఇంటి గేట్లు మూసేస్తానని...
కోట్లుకోట్లు ఆర్జించి కోటీశ్వరున్నౌతానని...
కుర్చీలో కూర్చోగానే కుబేరుడనౌతానని...
ఇక "నా దర్శనం" ఐదేళ్లకొక్కసారేనని...
అందుకే మీలో ఎవరికైనా
అర్జంటుగా నన్ను కలవాలనిపిస్తే...
నా "అడ్రస్" కనుక్కునేందుకు
మార్గాలు...రెండు
ఒకటి...మర్డర్లు మాఫీ చేసే
ఏ పోలీస్ స్టేషన్ కైనా ఫోన్ చెయ్యండి...
రెండు...గుర్తుతెలియని
హత్యలు చేసే ఏ గూండానైనా అడగండి.
