చర్చీలలో దర్గాలలో...
మందిరాలలో చేసిన
ఆ మౌన ప్రార్థనలు
ఏమైపోయెరా ఈశ్వరా..?
ఇదేమి మాయరా శంకరా..?
నా నవరత్నాల...నా సంక్షేమ
పథకాల ఫలాలు అందుకున్న
నా ఎస్సీల...
నా ఎస్టీల...
నా బీసీల...
నా మైనారిటీల...
నా క్రిష్టియన్ల...
నా లబ్దిదారుల...
నా వాలంటీర్ల లక్షల ఓట్లు
నా అవ్వాతల...ఆప్యాయతలు
నా అక్కా చెల్లెమ్మల...అనురాగాలు
ఏమైపోయెరా ఈశ్వరా...?
ఇదేమి మాయరా శంకరా..?
తమ పాలనలో కులం
మతం ప్రాంతం వర్గం చూడక
పార్టీలకతీతంగా బటన్ నొక్కినొక్కి
నేరుగా ఖాతాలకే అందించిన
ఆర్థిక సహాయానికి "కృతజ్ఞతగా"
గంటల తరబడి క్యూలో నిల్చొని
తిరిగి"మళ్ళీ మా అన్నే" రావాలని
"రామరాజ్యం" తేవాలని ఆశతో వేసిన
ఆ మహిళామణుల లక్షల ఓట్లు
ఏమైపోయెరా ఈశ్వరా...?
ఇదేమి మాయరా శంకరా..?
అన్నా...అనగానే
నే నున్నా...నే విన్నా...
నే వస్తున్నా... అంటూ
భరోసానిచ్చి ప్రతి పేదవాని
ఇంట్లో ఓ కొడుకుగా...
అక్కా చెల్లెమ్మలకు
ఓ అన్నగా...ఓ తమ్ముడిగా...
అవ్వాతాతలకు...ఓ మనవడిగా
ఆపదలో ఉన్న రోగులకెందరికో...
ఒక ప్రత్యక్ష దైవంగా...
పేదప్రజల పక్షపాతిగా...
ఆశాజ్యోతిగా జయహో జయహో
అని కీర్తింపబడిన..."జననేత"...కన్న...
వారాహి నెక్కి వరాలివ్వడమే...
తప్ప ప్రజలకేమీ చేయని "యువనేత"...
21 అసెంబ్లీ సీట్లకు 2 పార్లమెంటరీ
సీట్లకు పోటీ చేసి క్లీన్ స్వీప్ చేయడం
ఇదేమి మాయరా శంకరా..?
ఇదెక్కడి వింతరా ఈశ్వరా..?
ఓ పరమేశ్వరా ఏమైంది..?
ఎందుకిలా జరిగింది..?
ఇది విధి నవ్విన విషపు నవ్వా...?
ఇది కాలం చేసిన ఇంద్రజాలమా...?
ఇది అదృశ్యశక్తుల కుట్ర ఫలితమా...?
ఎంతకూ అర్థంకాకున్నదే
నేరం నాదికాదు ఆకలిది
అని ఓ గజదొంగ అన్నట్లు
మోసం మాది కాదు ఆ
ఈ.వీ.యంలదే అంటున్నారు
నక్కతోక తొక్కిన నాయకులంతా...
ప్రజాకోర్టులో ఓటర్లిచ్చినట్టు
భ్రమింప జేసిన...ప్రత్యర్థులు
సైతం కలనైనా ఊహించని
ఈ సంచలనాత్మకమైన...
ఈ చారిత్రాత్మకమైన...
ఈ విచిత్రమైన...ఈ వింత తీర్పు...
ఔరా ఇది ప్రజలిచ్చిన తీర్పా..?
కాదు కాదు చీకటి ఓట్ల సునామి..?
కృతజ్ఞతగా ప్రజలు ఓట్లేసి గెలిపించినా
ఏదో అదృశ్య వ్యక్తుల "దుష్టకూటమి"
తమ అతీంద్రియ శక్తితో ఓడించింది...
గట్టిగా దొంగదెబ్బ కొట్టి మట్టికరిపించింది...



