కొందరు
అభ్యర్థులు...
అనుచరులు...
పార్టీ అభిమానులు...
కాయకష్టం చేసిన కార్యకర్తలు...
ఎన్నో కలలుకని
ఎన్నికల ఫలితాలకోసం
వేయికళ్లతో ఎదురు చూస్తూ
విజయమో..? వీరస్వర్గమో..? అర్థంకాక
జుట్టు పీక్కుంటున్నారు...కొండమీది
కోతుల్లా...విలవిలల్లాడుతున్నారు.
కళ్ళల్లో ఒత్తులేసుకొని బెట్టింగులకు
కోట్లు ఖర్చుపెడుతూ...చెట్టుమీది
పిట్టల్లా...కిచకిచలాడుకుంటున్నారు
వ్యతిరేక సర్వేలకు...
ఉలిక్కిపడుతూ...
ఊహల్లో ఊరేగుతూ...
అనుకూల సర్వేలకు...
ఆశ్చర్యచకితులౌతూ...
మానసికంగా రోదిస్తూ...
పాపం అభ్యర్థులు గట్టుమీద పడ్డ
చేపల్లా...గిలగిలకొట్టుకుంటున్నారు...
ఇన్నేళ్ల ఎన్నికల చరిత్రలో
ఎన్నడూ లేనంత టెన్షన్ కు...
భరించలేని మానసిక క్షోభకు...
గృహప్రవేశం రోజు గుమ్మం ముందు
పగిలే గుమ్మడికాయల్లా నరాలుచిట్లే
ఒత్తిడితో...ఆందోళనతో...గూటిలో
గువ్వల్లా...గుబులు గుబులుగా ఉన్నారు
ఎక్కడెక్కడో ఎవరి కంటికి కనిపించక
నక్కల్లా...నక్కినక్కి తిరుగుతున్నారు
విదేశాలలో విమానాల్లో విహారయాత్రల్లో
వివాహంగాల్లా...స్వేచ్ఛగా విహరిస్తున్నారు
అతివిశ్వాసంతో
ఒకరు మీసం రువ్వుతువుంటే...
భరించలేని సందిగ్ధంలో
ఒకరు దగ్దమైపోతున్నారు...
భద్రతా వలయంలో ఉన్న
బ్యాలెట్ బాక్సులకు
దూరంనుండే మ్రొక్కుతూ....
పాపం పొర్లుదండాలు పెడుతూ...
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైతూ...
నిరీక్షణ ఒక నిప్పుల వంతెనయని...
నరాలు తెగే ఉత్కంఠ ఒక ఊబియని...
సర్వేల గుడ్డిగుర్రాలమీద స్వారీ చేస్తూ...
తమ ఎన్నికల నావ విజయాల తీరం చేరేనో...నడిసంద్రాన మునిగిపోయేనో అర్థం కాక పాపం అభ్యర్థులందరూ
క్షణమెక యుగంగా...
బ్రతుకు భయంగా భారంగా...
అంచనాల అంధకారంలో......
గెలుపు ఓటమిల గందరగోళంలో...
నవ్వులు... ఏడ్పులు చింతలు...చిరునవ్వులు
చీకటి వెలుగులు...
దోబూచులాడుతూ...
పిశాచుల్లా భయపెడుతూ ఉంటే...
బిక్కుబిక్కు మంటూ దిక్కులుచూస్తూ
పాపం వేడుకుంటున్నారు ఆ పరమాత్మను
తమకే విజయాన్ని చేకూర్చమని...
కారణం జనన మరణాలేవైనా...
గెలుపు ఓటములేవైనా అన్నీ దైవాధీనాలే
ఎవ్వరూ కాదనలేని నగ్నసత్యాలే గనుక...



