Facebook Twitter
ఎవరికెరుక..?

ఆంధ్రా ఎన్నికల్లో

ఓటర్లు పోటెత్తారు  

ప్రజాప్రతినిధులు...  

రాజకీయ మేధావులు...

జ్యోతిష్శాస్త్ర పండితులు... 

ఎవరి అంచనాల్లో వారు 

తనమునకలై ఉన్నారు 

తలలు పట్టుక్కూర్చున్నారు 

జుట్లు పీక్కుంటున్నారు 

ఈ ఎన్నికల హోరుగాలి 

కూటమి ఓటమి వైపో... 

ప్రభుత్వపథకాల వైపో... 

ఎటు వీచిందో అర్థం కాక... 

పోలింగ్ కేంద్రాల వద్ద 

ఒక వైపు లబ్ధిదారులు... 

ఒకవైపు చీమలబారులు...

కసితీరా కక్షతో ఓటేసి హాయిగా 

ప్రశాంతంగా నిద్రపోతున్నారు   

నరాలుతెగే టెన్షన్ భరించలేక 

పాపం అభ్యర్థులకు నరకమే...

విహారయాత్రలకు పయనమే...

ఔను అత్యంత  

ఉత్కంఠ భరితంగా 

ప్రశాంతంగా జరిగిన 

పోలింగ్ లో విజృంభించిన 

ఈ ఓటరు మాంత్రికులు

తమ ఎడమచేతి చూపుడు 

వేలికి వేసిన ఒక్క సిరాచుక్కతో

ఎవరి తలరాతలు తిరగరాశారో..?

ఎవరి జాతకాలను మార్చివేశారో..?

ఎవరికి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారో..? 

ఎవరిని బంగాళా ఖాతంలో కలిపేశారో..? 

ఎవరికి ప్రేమతో...పట్టాభిషేకం కట్టారో...?

ఎవరిని రాజకీయ సమాధిలోకి నెట్టారో..?

ఎవరికెరుక...? ఎవరికెరుక...? 

ఆ ఓటరు మాంత్రికులకు... 

ఓట్లను పీకలదాకా 

మెక్కిన ఆ ఈ.వి.యంలకు... 

పైనున్న ఆ పరమాత్మ తప్ప...