Facebook Twitter
ఆంధ్ర అగ్నిగుండంగా మారనుందా..?

రేపు 

చావో రేవో తేల్చే 

ఈ ఆంధ్రా ఎన్నికలు 

రెండు"అగ్రవర్ణకులాల" మధ్య 

హోరాహోరీ "పోరు"కావొచ్చు...

కుర్చీ కోసం "కుస్తీ" కావొచ్చు...

ఒకదాని తప్పు పొత్తులు 

కూటమిలో కుట్రలు కావొచ్చు 

ఒకదానికి నివురుకప్పిన నిప్పు 

మూడు రాజధానుల ముప్పు కావొచ్చు 

"అధికారం" కోసం 

"ఆరాటం" కావొచ్చు... 

"ఆధిపత్య పోరాటం" కావొచ్చు 

చిన్నాచితకా కులాలు 

మధ్యలో చితికిపోవచ్చు...

అడకత్తెరలో పోకచక్కలు కావొచ్చు 

బారులు తీరిన లబ్దిదారుల

దారులన్నీ పోలింగ్ బూతులవైపే

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో 

తమకందిన తాము పొందిన 

ఆర్థిక సహాయానికి"ఋణం 

తీర్చుకోవడం" కోసం కావచ్చు... 

పథకాల కొనసాగింపు కోసం 

పేదప్రజల"ఆశాభావం" కావొచ్చు...

ఇది అన్ని పార్టీల నుండి 

అతి రహస్యంగా పుచ్చుకున్న బహుమతులకు తాయిలాలకు 

"కృతజ్ఞత" కావొచ్చు...  

బద్దశత్రువులకు"రిటర్న్ గిఫ్ట్"కావొచ్చు

సిద్దం..! సిద్దం చేద్దాం 

రాజకీయ యుద్దం..! 

"డూ ఆర్ డై" అంటూ 

రాజకీయ రణక్షేత్రంలో

దూకిన రెండు పార్టీలకు 

ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికలు  

"లైఫ్ అండ్ డెత్" కావొచ్చు... 

ఇక ఫలితాలకు 

ముందు వెనుక 

ప్రత్యర్థి వర్గాలపై వారి 

ఖరీదైన వాహనాలపై 

ఇళ్ళఫై మెరుపు దాడులే... 

నడిరోడ్డులో ప్రత్యర్ధుల్ని

గొడ్డళ్ళతో నరకడమే...

రెచ్చిపోయి 

విచ్చలవిడిగా 

కత్తులతో కటారులతో 

వీధుల్లో అసాంఘిక 

శక్తుల వీరవిహారమే...

విధ్వంసం సృష్టించడమే...

దాడులకు ప్రతి దాడులే...

ఇక కలనైనా ఊహించని 

ఘోరమైన...దారుణమైన 

హింసాత్మక సంఘటనలే...

ఖర్మకాలి 

ప్రభుత్వం పతనమైనా..?

కూటమి ఓటమి పాలైనా..?

ఇక ఆంధ్ర రాష్ట్రం 

"ఆరని ఒక అగ్నిగుండమే"...

రగిలేది...పగాప్రతీకారాలతో  

రాజకీయ రావణకాష్టమే...

పారేది...రక్తపుటేరులే...

కూలేది...నిరుపేదల గుడిసెలే...

ఔను ప్రజల మాన ప్రాణాల్ని

హక్కుల్ని హరించే గుర్తుతెలియని 

గూండాలపై ఉక్కుపాదం మోపాలి...

రక్షణశాఖ రక్షణ కవచమై నిలవాలి...