నేడు నేతలు
వొంగి వొంగి
దండాలు పెడుతుంటే
ఓటర్లు
పొంగి పొంగి పోతారు
రేపు వారు
అధికారం దక్కగానే
కుర్చీలో కూర్చొని
కులుకుతారు
కుబేరులైపోతారు
రేపు ఈ
అమాయకపు ఓటర్లే
ఆకలికి అలమటించే
అస్థిపంజరాలౌతారు
ఓర్పు నశించిన
ఓటర్లే మార్పు కోరేది
తలలు పండిన నేతల
తలరాతలు మార్చేది
ఆగ్రహంతో ఓటర్లు
ఉగ్రరూపం దాల్చితే
రెప్పపాటున రాజ్యాలు కుప్పకూలిపోతాయి
ఓటర్లూ మీ ఓటు
విలువను తెలుసుకోండి
మీ వేలుతోనే మీ
కంటిని పొడుచుకోకండి
మీ వేలుకు రాసిన
సిరాచుక్కతో మీరు
అవినీతినేతలకు
చుక్కలు చూపించవచ్చు
వారు కన్న కలలను
కల్లలు చేయవచ్చు
వారి జాతకాలను
తారుమారు చేయవచ్చు
జరిగే ప్రతి
ఎన్నికల్లో మీరే గెలవాలి
ప్రగతికి ప్రజాశక్తికి
మీరే ప్రతిరూపం కావాలి
ప్రజాస్వామ్యానికి
మీరే పునాది వేయాలి
మీ చేతిలోని ఓటే
మీకు వజ్రాయుధం కావాలి
మీరే అవినీతినేతల
అంతుచూసి వారిని ఉరితీయాలి
నీతిగల నిస్వార్థపరులైన నేతలకు
శాసన సభలకు స్వాగతం పలకాలి
సుపరిపాలనకు మీరే ఊపిరి పోయాలి



