Facebook Twitter
తేలిపోతుంది జూన్ 4 న…

ఔరా..!  

ఈ ఎన్నికల్లో 

ఆంధ్రా ఓటర్లు పోటెత్తారు

వానలు దంచి కొడితే 

వాగులు వంకలు పొంగిపొర్లి 

వరదలొచ్చి గొడ్డూ గోదా 

కొట్టుకు పోయినట్టు... 

ఈ ఓట్ల వరదకు...

ఈ ఓట్ల సునామీకి... 

కొట్టుకుపోయిందెవరో...? 

గడ్డిపరకలా 

తట్టుకొని నిలబడిందెవరో..? 

తేలిపోతుంది జూన్ 4 న...

దేశం 

నలుమూలల నుండి 

ఉప్పెనలా సముద్రపు 

కెరటాల్లా ఎగిసిపడిన

ఈ ఓటర్ మాంత్రికులు 

ఎవరి కొంప ముంచారో..?

ఎవరి దుంప తెంచారో...? 

తేలిపోతుంది జూన్ 4 న...

రెండు వైపులా 

పదునైన ఓట్లకత్తితో... 

ఈ ఓటరు మాంత్రికులు 

ఎవరిని కసిగా పొడిచేశారో..?

ఎవరిపై కరుణకురిపించి కాపాడారో..?

తేలిపోతుంది జూన్ 4 న...

జోరు వానలో 

హోరుగాలిలా 

విరుచుకు పడిన 

ఈ ఓటర్ మాంత్రికులు 

ఎవరి నెత్తిన కిరీటం పెట్టారో..?

ఎవరిని వీధిలోచెత్తకుండీలోకి

ఎంగిలి విస్తరాకులా విసిరేశారో..! 

ఎవరికి ఓట్ల అరిటాకులో 

పంచభక్ష్య పరమాన్నం వడ్డించారో..?

తేలిపోతుంది జూన్ 4 న...

పోలింగ్ కేంద్రాల 

వద్ద పోటెత్తిన 

ఈ ఓటరు మాంత్రికులు 

ఎవరి నడ్డి విరిచారో..? 

ఎవరికి గడ్డి పెట్టారో..? 

ఎవరి నుదుట వీర

విజయతిలకం దిద్దారో..? 

ఎవరిని ఐదేళ్ల వనవాసానికి పంపారో..?

తేలిపోతుంది జూన్ 4 న...

ఈ భారీ పోలింగ్ దేనికి సంకేతం 

దుష్టకూటమి ఓటమికా..?

అవినీతి అసమర్థ ప్రభుత్వపతనానికా..!

తేలిపోతుంది జూన్ 4 న...

భారీ పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో

ఈ ఓటరు మాంత్రికులు 

ఎవరినెక్కించారో ఎవరెస్టు శిఖరం..?  

ఎవరికి చూపారో అథఃపాతాళం..?

ఎవరికి అందించారో అధికార పీఠం..?

ఎవరికి నేర్పారో గుర్తుండే గుణపాఠం..? 

తేలిపోతుంది జూన్ 4 న...