నిన్నటి వరకు
చేతులు జోడించి వాహనాలపై
నిలుచుని ఓటర్లందరిని తమ
ప్రసంగాలతో ఉర్రూతలూగించిన
అభ్యర్థుల పార్టీల తరుపున
రేయింబవళ్ళు రంగు రంగుల
జెండాలను ఎగురవేస్తూ
ఎర్రని ఎండలను లెక్కచేయక
కుర్రకారు ఖుషీఖుషీగా
ఆడుతూ పాడుతూ...
ఈలలేస్తూ...
చిందులుతొక్కుతూ
సుడిగాలిలా తిరుగుతూ
ఎంతో జోరుగా హుషారుగా
చెవులు చిల్లులు పడేలా అరుస్తూ
పోటాపోటీగా ప్రత్యర్థులు
ఉలిక్కిపడేలా చేసిన ఎన్నికల
ప్రచారం...హమ్మయ్య ముగిసింది
పోలింగ్ సైతం ప్రశాంతంగా జరిగింది
కానీ పార్టీల మధ్య
ఇప్పుడే అంతర్యుద్ధం మొదలైంది
పచ్చని పల్లెల్లో చిచ్చు రగిలింది...
హోరాహోరీగా అత్యంత ఉత్కంఠ భరితంగా నువ్వా నేనా అన్నంతగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాలొచ్చేలోగా
ఎన్నోచోట్ల
చెలరేగిన ఘర్షణల వల్ల
ఎందరో ఆవేశపరులు...
పార్టీ వీరాభిమానులు...
అమాయకపు కార్యకర్తలు...
కనుమరుగై పోవచ్చని...నా
మనసెందుకో ఏదో కీడును శంకిస్తుంది
రేపేమి ఘోరం
జరుగుతుందోనని...
ఎవరిమీద ఎవరు
కర్రలతో కత్తులతో
రాళ్ళతో నాటుబాంబులతో
దాడిచేసుకుంటారోనని...ఏ తల్లీదండ్రులకెంతటి గర్భశోకమోనని...
ఎందరు మహిళల మెళ్ళో
మంగళసూత్రాలు తెగిపోతాయోనని...
ఎవరు ఎవరితో తలపడతారోనని...
ఎవరి తలలు ఎగిరిపడతాయోనని...
ఎందరు హాస్పటల్లో
ఐసీయూలో చావుబతుకుల్లో
మృత్యువుతో పోరాడుతుంటారోనని...
ఆపై కేసులు పెట్టుకుని
పోలీసు స్టేషన్లచుట్టూ
కోర్టులచుట్టూ ఎంతకాలం
తిరగాల్సి వస్తుందోనని...
పత్రికల్లో వార్తలు చదువుతువుంటే...
టీవీలో విషాదకరదృశ్యాలు వీక్షిస్తుంటే...
ఎన్నికల జాతర ముగిసినా
ఈ ఆపగలు ఈ ప్రతీకారాలు
రావణకాష్టంలా రగిలేది
ఇంకెంత కాలమోనని...
ఏరోజు ఏఘోరం
జరుగుతుందోనని...
బాధతో భయంతో
ప్రతికుటుంబం వణికిపోతోంది
అందుకే నా మనసెందుకో...
కుమిలి కుమిలి పోతోంది
ఏదో తెలియని వేదన ఆవేదన
మూగరోదన నామదిలో రగులుతోంది
అయ్యో..! ఓ నా దైవమా...!
ఈ ఎన్నికల చిచ్చు ఆరేదెన్నడు...?
ఈ అమాయకపు ప్రజలు
కలిసిమెలిసి సోదరభావంతో
పార్టీలకు అతీతంగా ప్రశాంతంగా
చిరునవ్వులతో జీవించేదెన్నడు...?
కులాలకు మతాలకు అతీతంగా
మని మద్యం ఎరులైపారకుండా
రాజ్యాంగ నిబంధనలను గౌరవిస్తూ...
ఎన్నికల ప్రక్రియ జరిగినప్పుడే...
శాంతి ప్రజ్వరిల్లుతుంది...
ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది...



