Facebook Twitter
రేపు ప్రజాకోర్టులో తీర్పు...?

ఆంధ్రలోఓట్ల నోట్ల పండుగ 

ఎన్నికల జనజాతర ముగిసింది 

ఆశతో అందరి ఎదురుచూపులు 

రేపటి ఎన్నికల ఫలితాలకోసమే... 

ఎన్నికల చరిత్రలో 

ఎన్నడూ లేనంతగా 

ఎవరూ ఊహించని రీతిలో 

ఏ ప్రలోభాలకు లొంగక...

ఏ తాయిలాలకు ఆశపడక... 

సుదూర ప్రాంతాలనుండి 

బస్సుల్లో రైళ్ళల్లో కార్లల్లో

విదేశాలనుండి విమానాల్లో 

స్వచ్చందంగా వచ్చి 

పోలింగ్ కేంద్రాల వద్ద 

అర్థరాత్రి రెండుగంటల వరకు 

ఎదురు చూసి...నిదుర కాసి... 

ఓటేయనివారు‌... 

చచ్చినవారితో సమానమని...

ఓటే ఒక ఆయుధమని...

ఓటే ఒక ఔషధమని... 

ఓటే ఒక వరమని... 

ఓటే ఒక స్వరమని... 

ఓటు విలువ నెరిగి...  

కసిగా...కష్టంతో... 

ఎంతో ఇష్టంతో...

ఎంతో బాధ్యతగా...

 

తమ ఓటుహక్కును 

సద్వినియోగం చేసుకున్న ...

యువతీయువకులు... 

మహిళలు...వృద్దులు... 

వేసిన ఓట్లు...ఇచ్చిన తీర్పు 

నేతల తలరాతలు...జాతకాలు 

భారీ భద్రతతో స్ట్రాంగ్ రూముల్లో

ఈ వి యంలలో నిక్షిప్తమైపోయే...

 

ఎందరో 

తలలు పండిన 

రాజకీయనాయకుల...  

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల... 

సర్వేల కాకీలేక్కలకు సైతమందక 

గాలెటు వీచిందో గెలుపెవరికో అర్థంకాక 

అందరూ జుట్టు పీక్కుంటున్నారాయె...

అది కూటమి ఓటమో... 

అది ప్రభుత్వ వ్యతిరేకతనో... 

విజయహారతి ఎవరికి పడతారో...

ఎవరికీ దిమ్మతిరిగే షాక్ ట్రీట్మెంటిస్తారో...

ఒక్క సిరాచుక్కతో...

ఎడమచేతి చూపుడు వేలుతో...

నాయకుల జాతకాలను వ్రాసిన 

ఓటర్లు ప్రశాంతంగా నిద్రపోతుంటే...

21 రోజులు 

కంటికి కునుకులేక... 

మనస్సుకు శాంతిలేక... 

అభ్యర్థులు పార్టీ నాయకులు 

అభిమానులు కార్యకర్తలు 

ప్రజలు...ఫలితాలకోసం

నిరీక్షిస్తున్నారాయె... ఉత్కంఠతతో...ఉద్వేగంతో...  

 

రేపు ఈ ఓటరు మాంత్రికులు 

ఎవరిని పాతాళానికి త్రొక్కేస్తారో... 

ఎవరిని ఎవరెస్టు శిఖరమెక్కిస్తారో...

ఎవరిని గజమాలలువేసి 

ఏనుగులపై ఊరేగిస్తారో... 

ఎవరిని రాజకీయంగా సమాధి చేస్తారో...

ఎవరికి ఆ అధికారపీఠాన్ని అందిస్తారో...

రేపు ఎవరు గెలుపు గుర్రమెక్కి

వీధుల్లో విర్రవీగుతూ తిరుగుతారో... 

ఎవరి తలపై పూలవర్షం కురుస్తుందో...

ఎవరి గుండెల్లో 

అగ్నిపర్వతాలు బ్రద్దలౌతాయో...

ఎవరు అవమానంతో కృంగిపోతారో...

ఎవరిని ఆ విజయలక్ష్మి వరిస్తుందో ఎవరికెరుక....

స్ట్రాంగ్ రూముల్లోని ఈవీయంలకు

ప్రశాంతంగా నిద్రపోయే ఓటర్లకు...తప్ప 

అందుకే అంటారు

ఎన్నికల ఫలితాల్నెవరూ 

ఖచ్చితంగా అంచనా వేయలేరని...

ఆటేదైనా జయాపజయాలు దైవాధీనాలని