సంస్కారం… సాష్టాంగ నమస్కారం...
కొందరు నేతలు
ఎవరూ ఊహించని రీతిగా
ఆకాశంలో
అందనంత ఎత్తులో
సుప్రభాతవేళ బాలభాస్కరులై...
రాత్రిపూట చుక్కలో చంద్రులై...
వెలుగుతారు...వెలుగునిస్తారు
ఎవరెస్టు శిఖరమంత
ఎత్తుకు ఎదురులేక ఎదుగుతారు
ఫలాలనిచ్చే పచ్చని చెట్ట్లౌతారు
అది వారి సంస్కారం...
చేయాలి వారికి సాష్టాంగ నమస్కారం...
కొందరు నేతలు
అందరిపై ఆధిపత్యం
పెత్తనం చలాయించాలని...
అందరికీ దూరమౌతారు
తమ దారికి అడ్డొస్తే...
అన్యాయాన్ని ప్రశ్నిస్తే...
అథఃపాతాళానికి అణగద్రొక్కాలని...
రక్తపాతాన్ని సృష్టిస్తూ
రాక్షసత్వంతో దుష్టతలంపులతో
దుర్మార్గంగా దూసుకుపోతుంటారు
అది వారి
అహంకారం...
అధికార గర్వం...
అట్టి వారికి తక్షణమే
గుణపాఠాలు నేర్పాలి...
రహస్యంగా రాజకీయంగా
సమాధులు సిద్ధం చేయాలి...
సంతాపాన్ని తెలియజేయాలి...
అది ఒక్క ఓటు పోటుతోనే సాధ్యం...
ఓటరన్న విజయభేరి మ్రోగించుట తథ్యం



