కరుణించే కారుమేఘాలు
అలా అలా
నీలాల నింగిలో
చల్లని గాలి సోకి కదిలే...
కదిలి కరిగే...కరిగి కురిసే...
కారుమబ్బులే కదా
రైతులకు ప్రియమైన నేస్తాలు...
ఔను
కొన్ని మేఘాలు
గర్జిస్తాయి
ఉరుముతాయి
కొన్ని మెరుస్తాయి
మెరిసే మేఘాలు
వర్షిస్తే నేల హర్షిస్తుంది
పొలాలు పచ్చని చీరకట్టి
పరవశించి పోతాయి
రైతుల హృదయాలు
సంతోష సాగరాలై
ఉప్పొంగుతాయి
అన్నదాతల కళ్ళల్లో
ఆనందం తాండవిస్తుంది
పచ్చని పంటలు
పండుతాయని
అందరి
ఆకలి మంటలు
ఆరిపోతాయని
ఆశలు చిగురిస్తాయి
ఔను
ఆకాశం కన్నీరు కారిస్తే
నేల నవ్వుతుంది...
తను దాహం తీరుతుందని...
కొందరికి మెతుకు దొరుకుతుందని...
ఎందరికో బ్రతుకు మారుతుందని....



