మాయదారి మట్టి మనిషి
పెరుగుతున్న భూతాపానికి పొంచివున్న
ప్రమాదానికి అంతమెప్పుడని? చింతిస్తూ
నింగిలోకి తొంగిచూసే అన్నదాతలనడిగా
పంచభూతాల ఆగ్రహానికి కారణమెవరని?
కరగని కురవని ఆ నీలిమేఘాలేననె...
కరగని కురవని ఆ నీలిమేఘాలనడిగా...
మీరెప్పుడు చిరుజల్లులుగా మరేదని..?
తమను తాకని ఆ చల్లగాలినడగమనె...
మేఘాల తనువును తాకని చల్లగాలినడిగ
మబ్బులతో ఎందుకు మీకు విరోధమని..?
స్వార్థంతో వాతావరణాన్ని కలుషితం
చేసే మాయదారి మనుషులనడగమనె...
మాయదారి మనుషులనడిగా...
ఈ విషపూరిత శబ్ద జల వాయు భూ
వాతావరణ కాలుష్యానికి కారణమెవరని?
చేసిన శాసనాలను అమలుచేయని
ఆ అసమర్థ ప్రభుత్వాన్ని అడగమనె...
అసమర్ద ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించా
కాలుష్య నివారణ...పర్యావరణ పరిరక్షణ
బాధ్యతెవరిదని? ప్లాస్టిక్ ను విరివిగావాడే
పచ్చనిచెట్లను నరికే ఈ మట్టిమనిషిదేననె



