ఓ ఆధునిక మహిళా !
అంతర్జాతీయ మహిళా
దినోత్సవం సందర్భంగా నీకు
నా అక్షర సందేశం ఒక్కటే...
గడ్డిపరకలా బ్రతక్కు...
గండ్రగొడ్డలిలా బ్రతుకు...
కుత్తుకలు త్రెంచే కత్తిలా...
కంకులు కోసే కొడవలిలా...
నిత్యం నిఘాపెట్టి...
నీతిగా నిజాయితీగా ఉండు..
నిప్పు కణికల్లే భగ్గున మండు...
ఓ ఆధునిక మహిళా!
మత్తుమందుచల్లే మాయమాటల చెప్పె
మహామోసగాళ్ళ వలలో చిక్కుకోకు...
వారి ఊహల ఊబిలోకి జారిపోకు...
ఉక్కులా ఉండు...ఉక్కుసంకల్పంతో
"ఆ ఉన్మాదులకు" ఉరితాడును బిగించు...
ఓ ఆధునిక మహిళా !
నీ కాపురంలో
"కారు చిచ్చు"రేగకుండా...
నీ కుటుంబంలో
"పిడుగులవర్షం" కురవకుండా
చాటుమాటుగా కాటువేసే
కారుచీకటిలో సంచరించే...
"కాలనాగులను" సంహరించు...
ఉండు! జరా జాగ్రత్తగా ఉండు..!
విధి విషాద గీతం ఆలపించిన నాడు
భద్రకాళిలా కలకత్తా కాళికలా విజృంభించు
అందుకే...
ఓ ఆధునిక మహిళా !
జాగ్రత్త జరా జాగ్రత్త !
నీ ఇల్లు జాగ్రత్త !
నీ కళ్ళు జాగ్రత్త !
నీ ఒళ్ళు జాగ్రత్త !
నీ పరువు ప్రతిష్టలు జాగ్రత్త !
నీ పచ్చని సంసారం జాగ్రత్త !!



