కొక్కొరోక్కో యని కోడి కూసెరా...
తెల్లవారెనని తెలియజేసెరా...
తూర్పున సూర్యుడు తొంగిచూసెరా...
వెలుగు చీకటిని మ్రింగివేసెరా...
ప్రగతిరధం మోయగా...
జగతికి జీవం పోయగా...
వర్తమాన వీరుడవై...
సుఖాలనొసగు సూర్యుడవై...
లేరా...లేరా...రైతన్నా...
పొలం పోరా...పోరా...పోతన్న...
నీ సేద్యమందు...
నీ స్వేదమందు...
విశ్వానికి విశ్రాంతి చిక్కురా...
ఈ భూమిపైన
భుక్తికైనా...
నీవే దిక్కురా...
యిది నీకే మ్రొక్కురా...
మోడువారిన బీడు బ్రతుకున
చిరునగవులు చిగురించాలంటే...
కారుచీకటి క్రమ్మిన కళ్ళలో
జాబిల్లి వెల్గు జన్మించాలంటే...
"శ్రమయేవ జయతే"
అంటూ నినదిస్తూ
గురకలు మానాలిరా...
అరకలు కట్టాలిరా...
వెచ్చని మంటలు ఎగిసే బంజరుభూముల్లో
పచ్చని పంటలు పండించాలంటే....
"అన్నమో రామచంద్రా" అంటూ అలమటించే..
.అస్థిపంజరాల ఆకలిమంటలు తీర్చాలంటే..
"కృషితోనాస్తి దుర్భిక్షమంటూ"
హలంను పట్టాలిరా...
పొలమును దున్నాలిరా...
అంధులు ఏలే...
రాబందులు ఎగిరే...
రావణరాజ్యం రాలిపోవాలంటె...
రక్షణ దొరికె...క్రమశిక్షణ పెరిగె...
రామరాజ్యమె రావాలంటె...
"కష్టేఫలి" యంటూ
కండల్ని కరిగించాలిరా...
కొండల్ని పిండిచేయాలిరా...
లేరా...లేరా...రైతన్నా ....
పొలం పోరా...పోరా...పోతన్న...



