Facebook Twitter
కడుపు పుట్టిన కరోనా ....

కులాలు కుంపట్లు

మతాలు మంటలు

మా పెళ్లి పందిరిని తగులబెట్టాయి

మా ప్రేమకు అగ్నిపరీక్షలు పెట్టాయి

ఊరిపెద్దల పంచాయితీలంటూ

పోలీసులకు చుట్టూ,కోర్టుల చుట్టూ

తిరిగి తిరిగి ఇద్దరం అలిసిపోయాము

కయ్యానికి వియ్యానికి కాలు దువ్విన

రెండు కుటుంబాలు కారాలు మిరియాలే

కాదు కత్తులు సైతం రువ్వుకున్నాయి

ఘోరంగా సాధించారు, అతికౄరంగా వేధించారు 

పరువు హత్యలకు సిద్ధమయ్యారు

ఊరు ఒక్కటే కుటుంబాలు రెండు

మనుషులంతా ఒక్కటే మానవత్వమే వేరు

కట్టుకున్న,కడుపుతో వున్న భార్యను 

చూడ్డానికని అత్తారింటికి ఎరక్కపోయి వచ్చి

లాక్ డౌన్ పుణ్యమాని ఇరుక్కుపోయాను

ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగా వుండే

అత్తామామలు కొత్తగా కనిపించారు

వింతగా విచిత్రంగా మారిపోయారు

అందరి మనసుల్లో పేరుకుపోయిన

ఆ పంతాలు పట్టింపుల కల్మషాన్ని

కరోనా వచ్చి పూర్తిగా కడిగేసింది,

ఈ కులాలు మతాలు

ఈ ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదని

మంచితనం మానవత్వమే ముఖ్యమని

అందరిలో కనువిప్పు కలిగించింది

నిన్న కలహాల కారుచిచ్చు రేగిన కాపురాల్లో

నేడు అభిమానం ఆప్యాయతలు వెల్లివిరిశాయి

కరోనా ముందు మనుషులు 

కరోనా తర్వాత మనుషులన్నట్లు

మా ఇంట్లో ఓ వింత విభజన జరిగింది

అత్తామామలు అమ్మానాన్నలను మరిపించారు

మరిచిపోలేని మధుర ప్రేమను కురిపించారు

ఇంతలోనే లాక్ డౌన్, పాపపుట్టింది

పాపకు "కరోనా" అని పేరు పెట్టుకున్నాం

ఔనిదినిజం కరోనా పుట్టింది, మా కాపురాన్ని నిలబెట్టింది

 

(లాక్ డౌన్ తో గృహహింస కేసులు పెరిగినట్లు వార్తలు, కాని

అది నిజం కాదు ప్రతికుటుంబంలో కరోనా పెనుమార్పులను తెచ్చితీరుతుంది)