ఓ మనిషీ ! నీవిలా
అకస్మాత్తుగా అనూహ్యంగా
అతి దారుణంగా అతి భయంకరంగా
కలలో సైతం వుహించని రీతిలో
మాయదారి మహమ్మారి కరోనా బారినపడి
కన్నుమూస్తే,వీధిలో ఒక అనాధలా ...
కాసేపు కన్నీరు కార్చడానికి
నిన్ను చివరిచూపు చూడడానికి
నీవు చేసిన మహత్కార్యాలను,
నీ త్యాగాలను, నీ నిస్వార్థమైన సేవల్ని
నీ స్వచ్చమైన ప్రేమను,నీ మంచితనాన్ని
గుర్తుచేసుకొని,గుండెలు బాదుకునేందుకు
నీ కన్నవారుగాని, కట్టుకున్నవారుగాని రాకపోగా
అట్టహాసంగా జరగవలసిన నీ అంత్యక్రియలు
అతి సహజంగా, అతి రహస్యంగా జరిగితే
అయ్యో ఓ దైవమా ఏమిటీ ఈ జీవితానికర్థం?
ఇకనైనా మేము మారకపోతే మా జన్మ వ్యర్థం
మొన్నకొన్న ఆ ఖరీదైన కార్లు
బ్యాంకు లాకర్లలో దాచిన లక్షలు
నిన్న కట్టిన ఆ విశాలమైన, విలాసవంతమైన
ఆ బంగారు భవనాలు, ఏడంతస్తుల మేడలు
ఆర్జించిన కోట్లకొలది ఆస్తులన్నీ? ఏమైపోవాలి ?
ఎవరికి చెందాలి ? ఎవరు అనుభవించాలి?
అసలు ఏమిటీ ఈ దిక్కులేని కుక్కచావు ?
అయ్యో ఓ దైవమా ఏమిటీ ఈ జీవితానికర్థం?
ఇకనైనా మేము మారకపోతే మా జన్మ వ్యర్థం!
అయ్యో ఓ దైవమాఎక్కడున్నావయ్యా ?
ఏమిటీ ఈ ఘోరం? ఏమిటీ ఈ దారుణం ?
ఏమిటీ ఈ కరోనా కరాళ నృత్యం? కౄరత్వం?
ఏమీటీ కరోనా మరణాలు గుట్టలుగుట్టలుగా ఆ శవాలు
పాపం ప్రజలు రోజూ వేలమంది పిట్టల్లా రాలిపోతున్నారే?
బ్రతుకంటే ఇంతేనా ? బ్రతుకంటే ఒక వింతేనా?
నేడు గుబాళించి రేపు రాలిపోయే ఒక గులాబిపువ్వేనా?
అప్పుడే పుట్టి అప్పుడే పేలిపోయే ఒక నీటిబుడగేనా?
నేడు వెలిగి రేపు ఆరిపోయే ఒక చిరుదీపమేనా?
కరోనా వైరస్ పుట్టడమేంటీ ?ప్రపంచాన్ని చుట్టడమేంటి?
ప్రతితలుపును తట్టడమేంటి ? ముద్దు పెట్టడమేంటీ
షేక్ హ్యాండ్ ఇచ్చినవారంతా శవాలుగా మారడమేంటి?
అయ్యో ఓ దైవమా ఏమిటీ ఈ జీవితానికర్థం?
ఇకనైనా మేము మారకపోతే మా జన్మ వ్యర్థం!



