ఇక్కడ...అపరకుబేరుడు అంబానీ ఇంట
మూడుముళ్ల...ఖర్చు 5000 కోట్లట
అంగరంగ వైభవంగా వివాహ వేడుకలట
కోట్లు ఖరీదు చేసే దుస్తులతో...
మహరాజులా...అనంత్ అంబానీ...
స్వచ్చమైన మేలిమి
బంగారంతో నేసిన డిజైన్ చేసిన
కళ్ళు మిరుమిట్లు గొలిపే ఖరీదైన
వస్త్రాలతో బంగారు వజ్రాభరణాలతో...
మహారాణిలా...రాధికా మర్చెంట్......
పెళ్లి సంబరం అంబరాన్ని తాకిన వేళ
5000 కోట్ల భారీ ఖర్చుతో 3 రోజులు...
అతి ఖరీదైన విదేశీయుల వినోదాలే...
ఆటాపాటలతో చిత్తుచిత్తుగా చిందులే... అతిథులకు 3 వేల రుచులతో విందులే...
ఈ కుబేరుల్లో కొందరు కళ్ళున్నా అంధులే
కారణం అక్కడ...ముంబై
మురికివాడల్లో ప్రతికంట కన్నీరే...
"అన్నమో రామచంద్రా" అంటూ...
వీధి మలుపుల్లో చెత్తకుండీల్లో
విసిరేసిన విస్తరాకుల్లో
ఎంగిలి మెతుకులు ఏరుకునే...
కుక్కలతో కుస్తీ పట్టే...
చిరిగిన మురికి బట్టల్లో తిరిగే...
ఆకలికి అలమటించే...
అనాధ బాలలు అభాగ్యులు...
నీడలేని నిరాశ్రయులు
ఈ కుబేరుల కళ్ళకు కనిపించరా..?
వారి ఆకలి కేకలు
ఈ శ్రీమంతుల చెవులకు వినిపించవా..?
144 కోట్లమంది ఆకలిని తీర్చాలన్న తపనతో పంటల సాగు కోసం
చేసిన బ్యాంకు ఋణాలు తీర్చలేక
ఏ పురుగు మందులు త్రాగో...
ఏ చెట్టుకొమ్మలకు వ్రేలాడో...
ఆత్మహత్యలకు పాల్పడే అన్నదాతలు
ఈ కుబేరుల కళ్ళకు కనిపించరా..?
వారి ఆకలి కేకలు
ఈ శ్రీమంతుల చెవులకు వినిపించవా..?
ఓ దైవమా ఏమిటి ఈ వింత విచిత్రం....?
ఒకరికి తరతరాలకు తరగని ఆస్తులా...?
ఒకరికి నిత్యం విందులతో చిందులతో ...
వినోదాలతో విలావంతమైన జీవితమా..?
ఒకరికి ఆత్మ హత్యలు ఆకలిచావులా...?
ఒకరికి ఆరని అప్పులు ఆకలిమంటలా..?
ఒకరికి చీకటి బ్రతుకుల్లో చితిమంటలా..?



