ఈ కరోనా ఒక పాముకాటు
ఈ కరోనా ఒక పిడుగుపాటు
ఈ కరోనా ఓ కట్టప్ప కత్తిపోటు
ఈ కరోనా ఒక ఆరని కారుచిచ్చు
ఈ కరోనా ఎక్కడో,ఊహాన్లో పుట్టి
ప్రపంచానికి ఒక పీడలా ఒక శనిలా పట్టి
ఊహించని ఉప్పెనలా ఉగ్రరూపం దాల్చి
విషనాగులా, విషపు కోరలతో
విశ్వంమీద విరుచుకుపడుతుంటే
అగ్ని పర్వతాలను బద్దలు చేస్తుంటే
సునామీలను సృష్టిస్తుంటే
మదపుటేనుగులా మనుషులను
పాతాళానికి అణగద్రొక్కుతుంటే
తోడేలై చీకట్లో నక్కినక్కి తిరుగుతుంటే
పులిలా చిరుతపులిలా గాండ్రిస్తుందే
సింహంలా పంజా విసురుతుంటే
ప్రజలందరికీ,కంటిమీద కునుకులేకుండా
అగ్రరాజ్యాలనుక సైతం అల్లకల్లోలం చేస్తుంటే
కరోనా రోగులను కాపాడలేక,దేశాధినేతలు
జుట్టు పీక్కుంటున్నారే, బుర్రగోక్కుంటున్నారే
గట్టునపడిన చేపల్లా గిలగిల కొట్టుకుంటున్నారే
శ్మశానంలో గుట్టలుగుట్టలుగా పడివున్న
శవాలను చూసి గుండెలు బాదుకుంటున్నారే
అత్యంత శక్తివంతమైన రాజ్యాధినేతలు సైతం
నిస్సహాయులై,నిశ్చేష్టులై, నివ్వెరపోయి నిలుచున్నారే
దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారే,దిగులుగా వున్నారే
బిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారే
ఔరా ! ఔరౌరా ! అక్కటా !
ఏమిటీ ఈ విపత్కర పరిస్థితి?
ఏమిటీ జగత్తులోఈ విపత్తు
ఎంతకాలం ఈ వింత వినాశనం?
ఎంతకాలం ఈ భయంకరమైన విద్వంసం?
ఏమిటీ ప్రళయకాల కరోనా విలయతాండవం?
ఏమిటీ ఎంతకూ అంతుచిక్కని ఈ కరోనా మరణాలు?
ఎప్పుడు ఉదయించేను తిరిగి శాంతి కాంతి కిరణాలు?



