ఓసీ !కరోనా రాక్షసీ !
సర్వం బంద్ చేసిమా అందరినీ
ఇళ్ళల్లో బంధీలనుచేసి
రెక్కలు తెగిన పక్షులను చేసి
నీవు మాత్రం
విశ్వంలో విహంగలా
విచ్చలవిడిగా విహరిస్తున్నావే
వికృతి చేష్టలు చేస్తున్నావే
అగ్రరాజ్యాలకు సైతం
నీ ఉగ్రరూపాన్ని చూపించావే
నిర్లక్ష్యము చేసిన వారినెత్తిన
నిప్పులు కురిపించావే
అన్ని ప్రపంచదేశాలను
శవాల దిబ్బలుగా మార్చి
సెల్ఫీలు తీసుకుంటూ
సంబరపడిపోతున్నావే
ఓసీ కరోనారాక్షసీ! ఏమీఘోరకలి ?
ఇంకెప్పుడు తీరుతుంది నీ ఆకలి.?
ఓసీ! కరోనా రాక్షసీ!
ఓసీ మాయదారి మహమ్మారీ !
వేలమంది వలసకార్మికులు
పిల్లా పాపలతో
అల్లాడిపోతున్నారు
ఎర్రనిఎండల్నీ
లెక్కచేయక దిక్కు తోచక
నాలుగు మెతుకులు పెట్టే
దాతలకోసం
రోడ్లమీద ఆశతో
ఎదురుచూస్తున్నారు
ఆదుకునే నాధుడే లేక,
పనిల్లేక,పస్తులుండలేక
కన్నీటితో,పంపునీళ్ళతో
కడుపు నింపుకుంటుంటే
ఆకలికి అలమటిస్తుంటే,
అస్థిపంజరాలైపోతూ వుంటే
నీవు మాత్రం
కుళ్ళిపోయిన శవాలతో
పెళ్ళివిందు చేసుకుంటున్నావే
ఓసీ కరోనారాక్షసీ! ఏమీఘోరకలి ?
ఇంకెప్పుడు తీరుతుంది నీ ఆకలి.?



