Facebook Twitter
మానవత్వంలేని మానవజన్మ.

నాడు పొట్ట చేత పట్టుకొని

ఉన్న కొద్ది సామాన్లు సర్దుకొని

కంటిచూపు ఆనని 

కర్రసాయంతో నడిచే

కాటికి సిద్ధమైన

ఆరోగ్యం సరిగాలేని 

అమ్మానాన్నలను

మందులకు డబ్బులు తెస్తామని

ఛార్జీలకై ఊరంతా అప్పులు చేసి 

భార్య పిల్లలను వెంట బెట్టుకుని

ఏదో కూలీనాలీ చేసుకుని 

రెక్కలు ముక్కలు చేసి

నాలుగు రాళ్ళు సంపాదించాలని

బస్సులు రైళ్లు ఎక్కి వేలమైళ్ళొచ్చారూ

కొండంత ఆశతో వలసకార్మికులు

 

ఒక్కసారి ఆ మాయదారి 

మహమ్మారి కరోనా వైరస్

ప్రపంచంమీద పిడుగులా 

విరుచుకుపడిపోయె

లాక్ డౌన్ అంటూ ఉన్న చిన్న 

ఉపాధి కాస్త ఊడిపోయె

తినడానికి తిండి లేక పోయె 

ఉండడానికి ఇల్లులేకపోయె

చేతిలో డబ్బులు లేక

అద్దెలు కట్ఠలేక ఇళ్ళు ఖాళీచేసి 

చెట్లకీంద పిల్లాపాపలతో బతుకాయే 

ఇంత అన్నం పెట్టి ఆదుకునే 

నాదుడేకరువాయే అధికారులు 

ప్రభుత్వం పట్టించుకోదాయే

ఊరెళ్ళి పోదామంటే 

బస్సులు రైళ్ళు బందాయె

బ్రతుకు నరకమాయె 

కరోనా భయం అధికమాయే

చేసేదిలేక దిక్కు తోచక 

తట్టాబుట్టా నెత్తినెట్టుకొని

పిల్లాపాపలను వెంట బెట్టుకుని

సొంతూళ్ళకు పయణమైవెళ్ళిపోయారే

వేల కిలోమీటర్లు కాలినడకన 

ఆకలికి అలమటిస్తూ ఆవలసకార్మికులు

 

నేడిక్కడ తప్పించుకున్నా

రేపు అక్కడ ఆ పరమాత్మ  

ఈ పిల్లికి‌ బిక్షం వేయని

ఈ పిసనారులందరిని,

ప్రశ్నించక మానడు

చేయగలిగి,చేతులుండీ, 

సహాయం చెయ్యలేని

కాలినడకన వెళ్ళే ఆ అభాగ్యుల 

కష్టాలను కన్నీళ్ళను కళ్ళుండీ, చూడలేని

వారి ఆకలికేకలు చెవులుండీ, వినలేని

కోట్లుండీ,ఇంత అన్నం పెట్టి ఆదుకోని

హృదయముండీ, స్పందించని

పాషాణ హృదయులైన

ఆ ప్రభుత్వాధికారులను,

కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులైన

ఆ బడా వ్యాపారులను,

విలాసవంతంగా జీవించే

విశ్వాసంలేని ఆ సినీసెలబ్రిటీలను,

బ్రతికి వున్నంతకాలం తినలేని

పోయేనాడు ఏమీ పట్టుకు పోలేని

పరులకు పంచని దోచుకుని దాచుకున్న

ఆ కోట్ల ఆస్తి ఎందుకని ? అంత ఆశ ఎందుకని?

కాసింతైనా దయాగుణం దాతృత్వం మంచితనం

మానవత్వంలేని ఈ మానవజన్మ ఎత్తి లాభమేమని?