ఎందరో
మహానుభావులు
అందరికీ వందనాలు
ఓ సంపాదకులారా !
ఓ సాహితీ మిత్రులారా!
ఓ సరస్వతీ పుత్రులారా!
ఓ నా శ్రేయోభిలాషులారా!
మీ అందరికీ శుభం కలుగును గాక !
అంతులేని
ఆనందసాగరాన
ఎగిసి ఎగిసిపడే
మీ ఆలోచనల అలలు
ఆవలితీరం చేరును గాక !
శుభాలనొసగే ఆ సుందర
కిరణాల సూర్యబింబం
మీ కొత్తకోర్కెలను తీర్చును గాక !
ఆ ఏడుకొండల వెంకన్న
మీకు వెయ్యేనుగుల బలాన్నిచ్చునుగాక!
లక్ష కోట్లనక్షత్రాలకాంతిని
మీ బంగరుబ్రతుకుబాటలో విరజిమ్మునుగాక !
మీరుచేసే "ప్రతిపని"
పచ్చనిచెట్టులాఎదిగి పుష్కలంగా
అతిమధురమైన ఫలాలను అందించును గాక !
మీరువేసే "ప్రతిఅడుగు"
చక్కని పూలమొక్కైఅది
అందమైన మందారాలను
గుభాళించే గులాబీలను
మత్తెక్కించే మరుమల్లెలను
పుష్పించి మిమ్మల్ని పులకింపజేయును గాక !
మీరుతీసుకునే "ప్రతినిర్ణయం"
భగభగమండే నిప్పుకణికై
మీభవిష్యత్తును భోగభాగ్యాలతో నింపును గాక !
మీ సకల సమస్యలు ఎండిన
అరిటాకుల్లా రాలిపోవును గాక !
మీ సత్సంకల్పాలన్నీ సిద్దించును గాక !
మీ సంతోష సంబరాల
సందడి అంబరాన్ని తాకును గాక !
మీ మదిలో శాంతిసుధలు...
మీ ఇంటిలో సిరిసంపదలు...
మీ కన్నీళ్ళతో కాంతిరేఖలు...
మీ ముఖంలో చిరునవ్వులు...
మీ అలసిన గుండెలనిండా అంతులేని ఆత్మతృప్తి...
మీ శేషజీవితమంతా ఊహలకందని ప్రశాంతత...
జలపాతాలై జలజల దూకును గాక !
సెలయేరులై గలగల ప్రవహించును గాక !
కుంభవర్షాలై కుండపోతగా కురియును గాక !
మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో
సుఖశాంతులతో విలసిల్లుదురు గాక !
పిల్లాపాపలతో చల్లగా నిండూనూరేళ్ళు
హాయిగా ఆనందంగా వర్థిల్లుదురు గాక !



