నిన్నఊపిరాడని ఉరుకుల పరుగుల ఉద్యోగం
ఇల్లంటేనే నరకం,ఆఫీసే ఒక ఆనందనిలయం
కాని,కరోనా వచ్చి అందరికీ జ్ఞానోదయమైంది
భార్యా పిల్లలతో కమ్మని కబుర్లు చెప్పుకుంటూ
ఉల్లాసంగా ఉంటే,ఆ ఇల్లే ఒక భూతలస్వర్గమని
నిన్నతమకు అందని,చెందని వాటిని ఆశించారు
అర్రులు చాశారు ఆర్జించాలని పరుగులు తీశారు
నేడు కరోనా వచ్చి అందరికీ కనువిప్పు కలిగించింది
నాది నాది అనుకున్నదేదీ అసలు నీది నాది కాదని
ఖర్మకాలి కరోనా సోకితే, కడచూపైనా ఎవరికీ దక్కదని
నిన్న ప్రాణం ఖరీదు ,కరిగే కాలం విలువ, తెలియక
సమయాన్ని దుర్వెసనాలతో దుర్వినియోగం చేశారు
కోట్లు పోసైనా పోయే ప్రాణాన్ని కొనగలమనుకున్నారు
కాని నేడు కరోనా వచ్చిఅందరికీ గొప్పసందేశాన్నిచ్చింది
ఇమ్యూనిటీని పెంచుకోమని,ఆరోగ్యమే మహాభాగ్యమని
నిన్నవీధిలో బిక్షగాళ్ళను చూడగానే విసుక్కునేవారు
ఆకలిగొన్న అనాథలను చూస్తే అసహ్యించుకునేవారు
నేడు కరోనావచ్చి కళ్ళు,తెరిపించి,చెంపచెల్లు మనిపించి
కొందరికి జీవితాంతం గుర్తుండే ఒక గుణపాఠం నేర్పింది
లాకర్లో లక్షలున్నా కడకు సెల్ ఫోన్ కూడా మనవెంటరాదని
మంచితనం, త్యాగగుణం,మానవత్వం మరువరాదని



