Facebook Twitter
కరోనా తర్వాత  ఏమిటి ?What After Corona?...

మనతరంలో

మనం బ్రతికున్న కాలంలో

ఇంతటి ఘోరమైన పరిస్థితులను

కళ్ళతో చూస్తామని,చెవులతో వింటామని

కలనైనా ఊహించలేదు,నిజమే

 

కాలచక్రంలో కరోనా విషసర్పమొచ్చింది

కరుణ దయా జాలి లేకుండా కాటేసింది

మృత్యువై లక్షలమందిని మ్రింగేసింది

అన్ని దేశాలను చుట్టేసి,శవాలగుట్టలతో

ప్రపంచాన్ని ఒక స్మశానంగా మార్చివేసింది

 

గతం గతః మనమిప్పుడు

గుండెలనిండా గాలిని పీల్చుకొని

చీకట్లో కూర్చొని చింతిస్తూ,

కరోనా కరోనా అంటూ కలవరించక

ఆ కరోనా మహమ్మారి సోకి

కన్నుమూసి కాలగర్భంలో కలిసిపోకుండా

దిక్కులేని ఆ కుక్కచావు నుండి తప్పించినందుకు

ఆ ముక్కోటి దేవతలకు చేతులెత్తి మొక్కుదాం

ప్రభుత్వానికి,ప్రత్యేకంగా  కృతజ్ఞతలు చెబుదాం

చిరునవ్వులు చిందిద్దాం సంతోషంతో చిందులు వేద్దాం

 

ఆశల దీపాలను వెలిగించుకొని

కరోనా తర్వాత  కొత్త జీవితానికి,

గతంకంటే మంచి జీవితానికి

భయంతో వణకని జీవితానికి

ఎందుకూ కొరగాని కోట్లఆస్తులకోసం

ప్రాణాలకు తెగించి పరుగులు పెట్టక

అతిగా ఆశపడక, అందనిదానికోసం

నీకు చెందని దానికోసం, అర్రులుచాచక

ఆందోళన చెందక ఉన్నదాంతో తృప్తిచెందే

ఉత్తమమైన జీవితానికి నాంది పలుకుదాం

 

ఎన్ని పనులున్నా కుటుంబానికి

కొంత సమయం కేటాయించి

వారితో ఆనందంగా గడిపుతూ

నిన్నువలే నీ పొరుగువారిని

ప్రేమించుమన్నరీతిగా ,

ఇరుగుపొరుగు వారితో సహృదయంతో

సత్సంబంధాలు కలిగివుండే

సంతోషకరమైన జీవితానికి తెరలేపుదాం

 

ఆపదలో వున్నవారిని ఆకలిగొన్నవారిని

మంచితనంతో మానవత్వంతో ఆదుకోనే

చేయగలిగిన సహాయం నిస్వార్థంగా చేసే

ఆ డాక్టర్ల, నర్సుల,పోలీసులు

పారిశుద్ధ్య కార్మికుల,త్యాగగుణం కలిగిన

ఉత్కృష్టమైన ఓ కొత్తజీవితానికి అంకితమౌదాం

 

మన ముందున్న బంగారు భవిష్యత్తును

ఆనందంగా అనుభవించడానికి

కొండంత దైర్యంతో కొత్త ఆలోచనలతో

కొత్త కొత్త ప్లాన్లతో ముందుకు సాగిపోదాం

 

భయానికి దూరమౌదాం

పోరాటానికి సిద్దమౌదాం

ఎంతటి విపత్తు వచ్చినా

చింతించక కుంగిపోక చిరునవ్వుతో

ఈ కరోనా నేర్పిన గుణపాఠాలతో

చిమ్మచీకటిని చీల్చుకుని

ఉదయించే బాలభాస్కరులమౌదాం

ఆశతో హాయిగా ఆనందంగా బ్రతుకుదాం