ఉద్యోగులు కొందరు లాక్ డౌన్ పుణ్యమాని
ఉరుకు పరుగుల ఉద్యోగం మాని
ఇంట్లోనే వుంటూ భార్యాపిల్లలతో
ఖరీదైన కుక్కపిల్లలతో ఆడుకుంటూ,కోరిందితింటూ
టీవీలో సినిమాలు చూసుకుంటూ హాయిగా వున్నారు
కానీ,వలసకూలీలు కొందరు
చేతికి పనిలేక, తినడానికి తిండి లేక
ఆదుకునే నాధుడు లేక
పిల్లాపాపలతో ఆకలికి అల్లాడిపోతున్నారు
అస్థిపంజరాలైపోతున్నారు, అందుకే
ఏంచేయాలో దిక్కు తోచక
మూటాముల్లె సర్దుకొని, వేల
కీలోమీటర్లు నడుచుకుంటూ
పిల్లాపాపలతో, ఏడ్చుకుంటూ
కాళ్ళీడ్చుకుంటూ, అక్కడక్కడ ఆగి
పంపునీళ్ళతో కడుపు నింపుకుంటూ
ఉపాధిదొరక్క పక్షుల్లా ఉత్తరాంధ్ర కెగిరిపోతున్నారు
నిజమే వీరు లాక్ డౌన్ తో
రెక్కలు విరిగిన పక్షులయ్యారు
గాఢాంధకారంలో తిరిగే గబ్బిలాలయ్యారు
వాడిపోతున్న పూలదండలయ్యారు
పగిలిపోతున్న పాలకుండలయ్యారు
చెత్త కుండీల దగ్గర ఎంగిలి మెతుకుల కోసం
ఎదురుచూసే కుక్కలయ్యారు
నిన్నగుభాళించి నేడెండిపోయే పూలమొక్కలయ్యారు
తిరిగి తిరిగి అరిగిపోయిన కాలి చెప్పులయ్యారు
అందరూ త్రాగి వాడిపడేసిన కాఫీకప్పులయ్యారు
వీరు కరిగిపోయే కొవ్వొత్తులయ్యారు
వీరు ఆకలితో ఆరిపోయే దీపాలయ్యారు
ఔను లాక్ డౌన్ కొందరికీ శ్రీరామ రక్ష
కాని ఉత్తరాంధ్ర వలసపక్షులకిది జీవన్మరణశిక్ష
(ఓ నిండుగర్భిణి 500కి. మీ ప్రయాణానికి సిద్ధమైందన్న
వార్తా చదివి , ఆ వలసకూలీలకు, ఆ శ్రమజీవులకు చేతిలెత్తిమొక్కుతూ....వ్రాసిన కవిత)



